అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టే క్రమంలో తెలంగాణకు సరికొత్త టెక్నాలజీని అందివ్వడానికి ఐస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ముందుకొచ్చింది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా శాటిలైట్ సిగ్నల్స్‌ను ఉపయోగించి మావోయిస్టులు ఏ ప్రాంతంలో ఉన్నారు.. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? లాంటి విషయాలను సులువుగా తెలుసుకోవచ్చు. అయితే ఈ టెక్నాలజీని కేవలం మావోయిస్టుల పై నిఘా పెట్టడానికి మాత్రమే కాకుండా.. గంజాయి వనాలు సాగుచేస్తున్న సంఘవిద్రోహక శక్తుల జాడ కనుగొనేందుకు కూడా వాడాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న అవినీతిపరులు, అక్రమ మద్య వ్యాపారం చేస్తున్నవారు మొదలైన వారిని కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి పట్టుకోవచ్చని ఇస్రో, తెలంగాణ సర్కారుకి తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ అంశాలపై తెలంగాణ పోలీసు అధికారులకు ఇస్రో శాస్త్రవేత్తలు ఓ ప్రజెంటేషన్‌ను అందివ్వనున్నట్లు సమాచారం. 2018ని ‘టెక్నాలజీ సంవత్సరం’గా తెలంగాణ సర్కారు ప్రకటించిన క్రమంలో పోలీస్ వ్యవస్థలో కూడా ఆ టెక్నాలజీ వాడడానికి సిద్ధమవుతున్నారు తెలంగాణ పోలీస్ శాఖాధికారులు.
మావోయిస్టులపై నిఘాకై కొత్త టెక్నాలజీ..!