Terror Suspects Arrested: హైదరాబాద్‌లో మారుపేర్లతో మకాం.. ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. ఐదుగురు అరెస్ట్

Terror Suspects Arrested in Hyderabad: హైదరాబాద్‌‌లో ఉంటూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానాల కింద మధ్యప్రదేశ్ యాంటీ - టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ ఇంటెలీజెన్స్ పోలీసులు మంగళవారం అటు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇటు హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు జరిపారు.

Written by - Pavan | Last Updated : May 9, 2023, 07:09 PM IST
Terror Suspects Arrested: హైదరాబాద్‌లో మారుపేర్లతో మకాం.. ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. ఐదుగురు అరెస్ట్

Terror Suspects Arrested in Hyderabad: హైదరాబాద్‌‌లో ఉంటూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానాల కింద మధ్యప్రదేశ్ యాంటీ - టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ ఇంటెలీజెన్స్ పోలీసులు మంగళవారం అటు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇటు హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు జరిపారు. అనుమానిత ప్రాంతాల్లో జరిపిన ఈ సోదాల్లో భోపాల్‌లో 11 మంది అరెస్ట్ కాగా హైదరాబాద్‌లో మరో ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో మరొక నిందితుడు పరారయ్యాడు. గత 18 నెలల నుంచే వీళ్ల కదలికలపై నిఘావర్గాలు ఓ కన్నేసి పెట్టినట్టు తెలుస్తోంది. 

హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన వారిలో ఒక మెడికల్‌ కాలేజీలో హెచ్‌వోడీగా పనిచేస్తోన్న మహ్మద్‌ సలీమ్‌, కార్పొరేట్ కంపెనీలో క్లౌడ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ రెహ్మాన్‌, పాతబస్తీలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్న షేక్‌ జునైద్‌‌తో పాటు రోజువారీ కూలీలుగా పనిచేసుకుంటున్న మహ్మద్‌ అబ్బాస్, హమీద్ ఉన్నారు. మహ్మద్‌ సల్మాన్ అనే మరో రోజు వారీ కూలీ పరారవగా.. ప్రస్తుతం పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
 
హైదరాబాద్‌లో పట్టుబడిన నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఇతర స్టోరేజ్ డివైజెస్, ఎయిర్‌ పిస్టల్స్‌, పిల్లెట్స్‌, కత్తులు, డాగర్స్‌తో పాటు ఇస్లాంలో జిహాదీ సాహిత్యం ఉన్న గ్రంధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ అసలు పేర్లు దాచిపెట్టి మారుపేర్లతో చెలామణి అవుతున్నారని కేంద్ర నిఘావర్గాలు అందించిన సమాచారంతో గుట్టుచప్పుడు కాకుండా మద్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఈ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. 

అరెస్ట్ అయిన వారిని ప్రశ్నిస్తూనే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారాలను కేంద్ర నిఘావర్గాలు, మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ కౌంటర్ ఇంటెలీజెన్స్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపించినట్టు సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన నిందితులను సైతం భోపాల్ కి తరలించినట్టు తెలుస్తోంది. భోపాల్, హైదరాబాద్ కలిపి మొత్తం 16 మందిపై భోపాల్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Trending News