Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన అంశాలు

Telangana New Secretariat Building Inauguration: తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం భవనం ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రత్యేకతలు ఏంటి, అసలు పాత సచివాలయం ఉండగానే కొత్త సచివాలయాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే వివరాలు తెలుసుకుందాం రండి.  

Written by - Pavan | Last Updated : Apr 30, 2023, 05:52 AM IST
Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన అంశాలు

Telangana New Secretariat Building Inauguration: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరుచూ పై కప్పు పెచ్చులు ఊడిపడడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తడం, అన్ని వసతులతో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం లేమి, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులతో పాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాత సచివాలయం స్థానంలోనే రాష్ట్ర పాలనకు కేంద్రమైన కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 

పాత సచివాలయం స్థితిగతులపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినేట్ సబ్ కమిటి
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినేట్ సబ్ కమిటి పాత సచివాలయం కండీషన్ బాగా లేదని సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించింది.

పాత సచివాలయం తొలగింపు – నూతన సచివాలయం ఏర్పాటుపై నిపుణుల కమిటి 
ఈ పరిస్థితుల్లో ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతో ఒక నిపుణుల కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమగ్ర అధ్యయనంచేసి పలు లోపాలను గుర్తించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నివేదిక ఇచ్చింది. 

నూతన సచివాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ 
2019 జూన్ 27న కొత్త సచివాలయం భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. 

నూతన సచివాలయం డిజైనర్లు 
నూతన సచివాలయ నిర్మాణానికి డాక్టర్ ఆస్కార్, పొన్ని కాన్సెస్సావో అనే ప్రఖ్యాత ఆర్కిటెక్టులు డిజైనర్లుగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్ ఆమోదించిన ప్రస్తుత నమూనాతో నూతన సచివాలయం రూపుదిద్దుకున్నది.

నూతన సచివాలయం నిర్మించిన షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన సచివాలయన్ని నిర్మించే కాంట్రాక్టును దక్కించుకొని అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టింది. 

నూతన సచివాలయ భవనం డిజైన్ కు ప్రేరణ:
నిజామాబాద్‌లోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల్లోని శైలులు, అక్కడి గోపురాలు, గుజరాత్‌లోని సారంగాపూర్‌లో ఉన్న హనుమాన్ దేవాలయ శైలుల ఆధారంగానే సచివాలయం గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్‌లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. 

నూతన సచివాలయానికి నలువైపులా...
నూతన సచివాలయానికి తూర్పున లుంబినీ వనం, అమర జ్యోతి.. పశ్చిమాన మింట్ కాంపాండ్, ఉత్తరాన అంబేద్కర్ విగ్రహం, దక్షిణాన రవీంద్రభారతి వెళ్లే రోడ్డు నెలకొని ఉన్నాయి. 

నూతన సచివాలయం నిర్మాణం – ప్రత్యేకతలు 
•    కరోనా, కోర్టు కేసులు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులు అనుకున్నదాని కంటే కొంత ఆలస్యంగా 2021 జనవరిలో ప్రారంభమయ్యాయి. 
•    28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనం నిర్మించారు. ఇంత ఎత్తైన సచివాలయం ఏ రాష్ట్రంలోనూ లేదు.
•    స్వరాష్ట్రంలో నిర్మించే కొత్త సచివాలయం భిన్న సంస్కృతుల సమ్మేళనం.
•    దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి
•    భవనంపైన ఏర్పాటుచేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు.
•    పనులు మొదలయ్యాక 26 నెలల రికార్డు సమయంలో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంత భారీ నిర్మాణానికి సాధారణంగా ఐదేళ్ళైనా పడుతుంది.
•    సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్ కార్డ్ తో కూడిన పాస్ లు జారీ
•    300 సీసీ కెమెరాలు, 300 మంది పోలీసులతో నిఘా
•    కొత్త భవనంలో అత్యుత్తమ సాంకేతికత వినియోగించడం ద్వారా పాలన ఆన్‌లైన్ కానుంది.
•    డోమ్ లు, పిల్లర్ల నిర్మాణం కోసం గాల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ (జీఆర్ సీ) టెక్నాలజీని వినియోగించారు.
•    ఈ విధానంలో పిల్లర్ల తయారీకే 6 నెలల సమయం పట్టింది. 
•    రోజూ 3 వేల మందికి పైగా కార్మికులు పనిచేశారు.
•    మొత్తం 1000 లారీల రెడ్ శాండ్ స్టోన్ వినియోగించారు 
•    భవన నిర్మాణానికి రూ.617 కోట్ల మేర పరిపాలన అనుమతులు వచ్చాయి.
•    ఇప్పటి వరకు రూ.550 కోట్ల వరకు ఖర్చు చేశారు.
•    అనుకున్న దానికంటే 20-30 శాతం వ్యయం పెరిగింది.
•    ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ పర్యవేక్షించడం, అన్ని పనులు ఒకే నిర్మాణ సంస్థకు అప్పగించడం వల్ల త్వరగా పూర్త చేయగలిగాం.
•    ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి.
•    ఏసీ కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్‌నే నెలకొల్పారు.
•    24 లిఫ్ట్ లను ఏర్పాటు చేశారు.
•    అన్ని రకాల అవసరాల కోసం 5.60 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేశారు.
•    కరెంట్ పొదుపునకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
•    ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు.
•    ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించే అవకాశం ఉంది.
•    మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు.
•    సచివాలయం ముందువైపు రెండు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఏటీఎమ్ సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్ ఉన్నాయి.
•    వెనుకవైపు ఉద్యోగుల అసోసియేషన్, ఇండోర్ గేమ్స్, హౌసింగ్ సొసైటీ కార్యాలయాల కోసం నాలుగు అంతస్తులతో ఒక బిల్డింగ్‌ను నిర్మించారు.
•    సచివాలయంతో పాటు గుడి, మసీదు, చర్చిలను కూడా నిర్మించారు. వాటి పక్కనే ముందువైపు రిసెప్షన్ హాల్, ఎన్ఆర్ఐ సెంటర్, పబ్లిసిటీ సెల్ పక్కనే మీడియా కోసం గదులు నిర్మించారు.
•    మంత్రులు మొదలుకుని అధికారులందరూ ఇక్కడే ఉండడంతో సమస్యలతో వచ్చే ప్రజలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది.
•    భద్రత దృష్ట్యా స్మార్ట్ కార్డుతో కూడిన పాస్‌లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
•    ఆరో అంతస్తుపైన డోమ్ కు మధ్య 4,500 చదరపు అడుగుల చొప్పున రెండు అంతస్తులను నిర్మించారు.
•    రాష్ట్ర పర్యటనకు వచ్చే రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు విదేశీ అతిధుల కోసం వీటిని వినియోగిస్తారు. వీటిలో పర్షియన్ మోడల్ లో రాయల్ డైనింగ్ హాల్స్ ను ఏర్పాటు చేశారు.
•    వీటితో పాటు రాయల్ కాన్ఫరెన్స్ హాళ్లను కూడా నిర్మించారు.
•    మొత్తం 4 ద్వారాలను ఏర్పాటు చేశారు.
•    తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచి సీఎం, సీఎస్, డీజీపీ, మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తారు.
•    పడమర వైపు ద్వారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తారు.
•    ఈశాన్య గేటు నుంచి అన్ని శాఖల ఉద్యోగులు వస్తారు.
•    ఆగ్నేయ ద్వారం నుంచి సందర్శకులు వస్తారు.
•    ప్రతీ చోట ఎక్కడికక్కడే పార్కింగ్ సౌకర్యం కల్పించారు. 
•    విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ ఫౌంటెయిన్లతో ఆకట్టుకుంటున్న సచివాలయ భవనం.
•    విద్యుత్ దీపాలతో పాలనా సౌధం ధగధగలాడుతోంది.
•    విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ ఫౌంటెయిన్లతో చూపర్లను ఆకట్టుకుంటోంది.
•    ఎత్తైన స్థంభాలు, భారీ గుమ్మటాలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
•    విశాలమైన పోర్టికో తో ఉన్న ప్రధాన ముఖ ద్వారం సచివాలయ సౌధం అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.
•    ఇదంతా కేసీఆర్ మదిలో నుంచి వచ్చిన ఆలోచనే.
•    పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా ఈ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణం జరిగింది.
•    ఎయిర్ పోర్ట్ అథారిటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసి తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించాం.
•    ఈ ఏప్రిల్ నెలాఖరు నాటికి 26 నెలల సమయం పూర్తవుతుంది.
•    ఆర్ అండ్ బి శాఖ ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్), టిఎస్ టెక్నలాజికల్ సర్వీసెస్, రాష్ట్ర పోలీసు విభాగాల సూచనలతో లోపం లేకుండా ఈ భవన నిర్మాణం జరిగింది.
•    దేశంలోని చారిత్రక కట్టడాల కన్నా దీనిని ఎక్కువ ఎత్తులో నిర్మించారు.
•    అందులో రెండుసార్లు 45 రోజుల చొప్పున కరోనాతో పనులు ఆగిపోయాయి. అయినా కార్మికులను ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
•    మొదటగా ఈ నిర్మాణం ప్రారంభించినప్పుడు 1500 మందితో ప్రారంభమై చివరకు 4000 మంది కార్మికులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు.
•    నూతన సచివాలయాన్ని పరిపాలనా సౌలభ్యంగా ఉండేలా అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు.
•    సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా ఎ,బి,సి,డి విభాగాలుగా సచివాలయన్ని విభజించారు. .
•    ఒక్కో విభాగాన్ని కొన్ని శాఖలకు కేటాయించారు.
•    అన్ని అంతస్థుల్లో ఉద్యోగులకు లంచ్ రూమ్ లను నిర్మించారు.
•    ఆరో అంతస్థులో క్యాబినెట్ మీటింగ్ హాల్, కాన్ఫరెన్స్, హాళ్లను ఏర్పాటు చేశారు.
•    సచివాలయంపై నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
•    ఆహ్లాదకరంగా ఉండేందుకు సచివాలయం ముందు, భవనం మధ్య భాగంలో గ్రీనరీ ఏర్పాటు చేశారు.
•    చుట్టూ రోడ్లతో పాటు నలుదిక్కులా గేట్లను అమర్చారు.
•    అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భవనం చుట్టూ ఫైరింజిన్ తిరిగేలా ఏర్పాట్లు చేశారు.
•    ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమీకృత సచివాలయ భవన నిర్మాణం దేశంలోని ఎన్నో ప్రముఖ చారిత్రక కట్టడాలకన్నా ఎంతో ఎత్తైనది. 
•    ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటు చేసిన అశోకుడి చిహ్నం నేలపై నుంచి 265 అడుగుల ఎత్తులో ఉంది.
•    గాలి, వెలుతురు ధారళంగా వచ్చే విధంగా నిర్మించారు.
•    28 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో మాత్రమే భవనాన్ని నిర్మించారు.
•    పార్కింగ్ ను 6 ఎకరాల్లో చేసేలా తగిన విధంగా ఏర్పాట్లు చేశారు.

•    2వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించాం.
•    లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్స్, రికార్డ్ రూంలు, వివిధ సేవలు.
•    ఉద్యోగుల కోసం ప్రతి అంతస్థులో ఒక లంచ్ రూమ్ నిర్మాణం.
•    రికార్డులు, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, భవన నిర్వహణ తదితర ఆఫీసులను గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు.
•    ఫైర్ స్టేషన్, క్రెషి, డిస్పెన్సరీ, ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్, సెక్యూరిటీ సిబ్బందికి వెస్ యాన్సిలరీ బిల్డింగ్ లు ఉన్నాయి.
•    సౌత్ వెస్ట్ వైపు ఆలయం, మసీదు, చర్చిలను నిర్మించారు.
•    సందర్శకుల కోసం 160 కార్లు, 300 బైక్ లకు సౌత్ ఈస్ట్ వైపు పార్కింగ్ సౌకర్యం ఉంది.

•    635 గదులు.. 30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలు.. అదే తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం.
•    సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది.
•    ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్ యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు.

•    ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది.
•    భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. అప్పట్లో 6 శాతంగా ఉన్న జీఎస్టీ తర్వాత 18 శాతానికి పెరిగింది. నిర్మాణ సామాగ్రి పనులు పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది.
•    ఆరో అంతస్తులోని సీఎంవోకు చేరుకునేందుకు రెండు లిప్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను రూపొందించారు. మంత్రి, కార్యదర్శి, ఆ శాఖ అధికారులంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సచివాలయం దేశంలో ఇదొక్కటే.
•    విదేశీ ప్రతినిధులు, ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హై టీ, రాయల్ డిన్నర్ లకు వినియోగిస్తారు.
•    అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించోచ్చు. ఈ ప్రాంతాన్ని స్కై లాంజ్ గా వ్యవహరిస్తారు.
•    పార్లమెంటు భవనానికి వినియోగించిన ధోల్ పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3,500 క్యూ.మీ. పరిమాణంలో వాడారు. ఇందుకు రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో ఏకంగా ఓ గని మొత్తాన్ని వినియోగించారు. అక్కడి నుంచి వేయి లారీల్లో రాయిని హైదరాబాద్ కు తరలించారు. బేస్ మెంట్ మొత్తానికి ఎర్ర రాయిని వాడగా, ప్రధాన గుమ్మటం నుంచి పోర్టికో వరకు లేత గోధుమ రంగు రాయిని వాడారు.
•    స్తంభాలు ఇతర భాగాల్లో ప్రత్యేక నగిషీ ఆకృతుల కోసం గాల్వనైజ్డ్ రీ ఇన్ ఫోర్స్ డ్ కాంక్రీట్ పద్ధతిలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ డెకొరేషన్ చేయించారు. తద్వారా దేశంలో ఈ స్థాయిలో జీఆర్ సీ చేసిన తొలి భవనంగా సచివాలయం నిలిచింది.
•    ప్రధాన పోర్టికో ఎత్తు ఏకంగా 42 అడుగులు. అంత ఎత్తుతో భారీ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భవనంలో ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తుతో నిర్మించారు.
•    భవనంలో మొత్తం 24 లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కై లాంజ్ వరకు వెళ్లేందుకు రెండు వైపులా 4 లిఫ్టుల చొప్పున 8 లిఫ్టులున్నాయి.

ఇది కూడా చదవండి : Komatireddy Venkat Reddy: ఒకప్పుడు స్కూటర్‌పై తిరిగిన జగదీష్ రెడ్డి జాతకం ఏంటో తెలియదా ?
 
విస్తీర్ణం వివరాలు

•    మొత్తం భూ విస్తీర్ణం : 28 ఎకరాలు
•    భవనం నిర్మించిన ఏరియా : 2.45 ఎకరాలు
•    ల్యాండ్ స్కేపింగ్ : 7.72 ఎకరాలు
•    సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్ : 2.2 ఎకరాలు
•    పార్కింగ్ : 560 కార్లు, 700 ల బైక్ లు, 
•    యాన్సిలరీ బిల్డింగ్ ఏరియా : 67,982 చ.అ.
•    ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా : 8,58,530 చ.అ.
•    లోయర్ గ్రౌండ్ + గ్రౌండ్ + ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు : 14 అడుగులు
•    అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు
•    భవనం పొడవు, వెడల్పు : 600 X 300
•    ప్రధాన గుమ్మటాలు (స్కైలాంజ్) : 11వ అంతస్థు

ఇతర నిర్మాణ ప్రత్యేకతలు:

మహాద్వారం 
29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో బాహుబలి మహాద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాదు అడవుల్లోని టేకు కలపతో నాగపూర్ లో ఈ మహాద్వారాన్ని తయారుచేయబడింది. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో తలుపులన్నింటినీ టేకుతోనే తయారు చేశారు.

డోమ్ ల ఏర్పాటు
సచివాలయ భవనంపైన నాలుగు రకాలైన 34 డోమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ డోమ్‌లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించారు. ‘ఏ’ టైప్‌ డోమ్‌ 23.6 ఫీట్లు, ‘బీ’ తరహా డోమ్‌లు 31 ఫీట్లు, ‘సీ’ టైప్‌ 21.6 ఫీట్లు, ‘డీ’ తరహా డోమ్‌లు అన్నిటికంటే పెద్దవి 54.8 ఫీట్లు ఉంటాయి. ఈ డోమ్‌ల నిర్మాణానికి 90 టన్నుల వరకు ఐరన్‌ ఉపయోగించబడిందని అంచనా.

బాహుబలి డోమ్స్‌
తాజ్‌ మహల్, గుల్బర్గా గుంబజ్‌ వంటి కట్టడాల్లో భారీ డోమ్స్ (గుమ్మటాలు) నిర్మించినట్టుగా రాష్ట్ర సచివాలయంలో రెండు భారీ డోమ్స్ నిర్మించారు. 34 గుమ్మటాలు, జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మలు కొత్త సచివాలయానికి మకుటాల్లా నిలిచాయి. 165 అడుగుల ఎత్తున ప్రధాన గుమ్మటాన్ని నిర్మించారు. ఇలా సచివాలయానికి ముందు, వెనుక ప్రధాన గుమ్మటాలను నిర్మించారు. ఆధునిక నిర్మాణాల్లో, అందులోనూ ప్రభుత్వ భవనాల్లో ఇలా భారీ డోమ్స్ రూపొందించడం ఇదే తొలిసారి. ఒక్కో డోమ్ 82 అడుగులు ఎత్తు (దాదాపు ఎనిమిది అంతస్తులు), 52 అడుగుల వ్యాసం కలిగి ఉంది. ఇవి సచివాలయ భవనానికి ప్రధాన ఆకర్షణగా, సచివాలయ భవనం డిజైన్‌ ప్రకారం తూర్పు, పశ్చిమ భాగాల్లో భవనంపై ఉన్నాయి. డోమ్‌ల లోపలి భాగాన్ని స్కైలాంజ్‌ తరహాలో రూపొందించారు. ఇందులోని విశాలమైన కిటికీల నుండి చుట్టూ నగరాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ డోమ్‌ల ప్రాంతం వీఐపీ జోన్‌గా ఉంటూ, సీఎం ముఖ్యమైన సమావేశాలు నిర్వహించేలా రూపొందించబడింది. పైభాగంలో ఉండే రెండు ప్రధాన గుమ్మటాలు సహా మొత్తం  34 డోమ్స్‌  నిర్మించారు. 

జాతీయ చిహ్నం
ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటుచేశారు. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే జాతీయ చిహ్నాలను ఢిల్లీలో తయారు చేయించి తీసుకువచ్చి అమర్చారు. 

ఇది కూడా చదవండి : Revanth Reddy Nalgonda Meeting: ఇది నల్గొండ బిడ్డలకే అవమానం.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్

మినీ రిజర్వాయర్
నీటిని పొదుపు చేసే ఉద్దేశంతో సచివాలయ భవనం భూగర్భంలో రెండున్నర లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ నిర్మించబడింది. భవనం నలువైపుల నుంచి వాన నీటిని రిజర్వాయర్ లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.  సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 9 ఎకరాల పచ్చిక బయళ్ళ నిర్వహణకు ఈ రిజర్వాయర్ లోని నీటినే వినియోగిస్తారు. 

ఫౌంటెన్లు
పార్లమెంటులో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో (28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వైశాల్యం) సచివాలయంలో ముందు భాగంలో రెడ్‌శాండ్‌ స్టోన్‌తో రెండు ఫౌంటెయిన్లు ఏర్పాటుచేశారు.
ప్రార్థనా మందిరాలు
సచివాలయంలో మునుపటి మాదిరిగానే హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాలను ప్రభుత్వం నిర్మించింది. గతం కంటే విశాలంగా, సుందరంగా వీటిని తీర్చిదిద్దారు. ఆయా మత పెద్దల ఆకాంక్షల మేరకు నిర్మాణాలు చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దేవాలయం, మసీదు, చర్చి కోసం సుమారు తొమ్మిది వేల చదరపు అడుగులను కేటాయించారు. 

భద్రత ఏర్పాట్లు
సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశించగలరు. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహారా కాయనున్నారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్టమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకులు ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా వారి సమాచారం ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి. 

ద్వారాలు-ప్రవేశం
•    సచివాలయం నాలుగు దికుల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో నార్త్‌వెస్ట్‌ (వాయువ్య) ద్వారాన్ని అవసరం వచ్చినపుడు మాత్రమే తెరుస్తారు.
•    నార్త్ఈస్ట్‌ (ఈశాన్య) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలు కొనసాగుతాయి. సౌత్‌ఈస్ట్‌ (ఆగ్నేయం) ద్వారం విజిటర్స్‌ కోసం వినియోగిస్తారు. 
•    సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
•    తూర్పుగేట్‌ (మెయిన్‌గేట్‌) ముఖ్యమంత్రి, సీఎస్‌, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ అతిథుల కోసం మాత్రమే వినియోగిస్తారు.
•    దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు ఏర్పాటు చేశారు. 

సచివాలయ నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి
•    ఉక్కు: 8,000 మెట్రిక్ టన్నులు
•    సిమెంటు: 40,,000 మెట్రిక్ టన్నులు
•    ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు)
•    కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు
•    ఇటుకలు: 11 లక్షలు
•    ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు 
•    గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు
•    మార్బుల్: లక్ష చదరపు అడుగులు
•    ధోల్ పూర్ రెడ్ స్టోన్: 3,500 ఘనపు మీటర్లు
•    కలప: 7,500 ఘనపుటడుగులు
•    పనిచేసిన కార్మికులు: మూడు షిప్టుల్లో 12,000 మంది

సచివాలయంలో అంతస్తుల వారీగా విభాగాల వివరాలు – 

గ్రౌండ్ ఫ్లోర్ : ఎస్సీ మైనార్టీ, లేబర్, రెవెన్యూ శాఖలు
1వ అంతస్తు: ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖ
2వ అంతస్తు:  ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖ
3వ అంతస్తు: ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ డిపార్ట్ మెంట్, ప్లానింగ్ డిపార్ట్ మెంట్ 
4వ అంతస్తు :  ఫారెస్ట్, కల్చరల్ డిపార్ట్ మెంట్, నీటి పారుదల శాఖ, లా డిపార్ట్ మెంట్
5వ అంతస్తు: ఆర్ అండ్ బి, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్తు: సీఎం,  సీఎస్, సిఎంవో ఉన్నతాధికారులు,పీఆర్వో, సిబ్బంది కార్యాలయాలు 

ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు
ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్ తో ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు 'జనహిత' పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చదవండి : Revanth Reddy Appeal to Muslims: ముస్లింలు ఎవరి పక్షం.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని నామకరణంచేసిన సీఎం కేసీఆర్ 
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్    అంబేద్కర్ పేరును పెట్టాలని 2022 సెప్టెంబరు 15న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీచేయగా, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం. 111, 15/09/2022) జారీ చేశారు.  

నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టడానికి గల కారణాలను సీఎం కేసీఆర్ వివరించారు. సీఎం కేసీఆర్ గారి మాటల్లో -
“దేశం గర్వించదగ్గ రీతిలో అందరివాడు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ మహాశయుని మహా విగ్రహాన్ని    మనం   ఆవిష్కరించుకోబోతున్నం. ఈ దేశం ప్రజలకోసం భవిష్యత‌  తరాలకోసం రాజ్యంగ నిర్మాతగా     సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధునిగా వారు చేసిన కృషి, త్యాగం అజరామరం. కేవలం    దళితులు, గిరిజనులు బహుజనులు, భారతదేశ ప్రజలు మాత్రమే కాదు.. వివక్షను ఎదుర్కొనే ప్రతి చోటా అంబేద్కర్ ఆశయం సాక్షాత్కారం అవుతుంది. అంబేద్కర్ మహాశయుడు విశ్వ మానవుడు. వారి కృషి ఒక్కటని చెప్పలేం. వారికి మనం ఎంత చేసుకున్నా తక్కువే. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే వారి అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్పూర్తి పొందడమే. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే.. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం.” 

ప్రతిష్టాత్మక ఐజిబిసి గుర్తింపు
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. 

నూతన సచివాలయం ప్రారంభోత్సవం
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి నిర్ణయం మేరకు నూతన సచివాలయం ప్రారంభోత్సవాన్ని  ఏప్రిల్ 30న నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సుదర్శన యాగం కోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాల సిద్ధమైంది. 

ఆదివారం ఉదయం సూర్యోదయం [ఉ. 6 గంటల] తరవాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం..కానున్నది. మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తరవాత నూతన సమీకృత సచివాలయం రిబ్బన్ కటింగ్ చేసిన  వెంటనే 6 వ అంతస్తులోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువుదీరనున్నారు. మధ్యాహ్నం 1.58 గం. నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో తమతమ ఛాంబర్లలో వివిధ శాఖల మంత్రులందరూ కొలువుదీరనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్ వుంటుంది. సచివాలయ ఉద్యోగులు ఆహ్వానితులతో కూడిన సమావేశాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

అందుకు అనుగుణంగా కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం, సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సిబ్బంది తమతమ ఛాంబర్లు సీట్లల్లోకి చేరుకుంటారు. ఇక అక్కడనుంచియ నూతనంగా నిర్మించి...డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం...  పూర్తిస్థాయి విధులతో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. 

ఈ కార్యక్రమంలో సిఎంవో  సచివాలయ సిబ్బందితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, మేయర్లు ఇలా మొత్తం సుమారు 2500 మంది దాకా ఆహ్వానితులుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి : Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న పార్టీ వెనుక ఎవరున్నారు ? తెలంగాణలో అసలేం జరుగుతోంది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News