T Congress: సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత కొరవడినట్లు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో ఒక అంచనాకు రాలేకపోతుంది. వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరంను అసలు రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది అనేది రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.ఎన్నికల ముందు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు దెబ్బతినగా దానిని కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంది. ఒక రకంగా ఉత్తర తెలంగాణలో ఇదే అంశం రాజకీయంగా చాలా కీలకంగా మారి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. అలాంటి కాళేశ్వరం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక తికమకపడుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే కాంగ్రెస్ కు ఈ అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతుందేమో అనిపిస్తుంది.
ఒక వైపు కాళేశ్వరంపై విచారణ కమిటీలు కొనసాగుతుండగానే మరోవైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య దీనిపై పెద్ద ఎత్తున రాజకీయం రగడ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ తెలంగాణకు జీవధార ఐన కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తుంది. ఈ రెండు పార్టీల నడుమ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది.
తాజాగా ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే బీఆర్ఎస్ ప్రాజెక్టుల సందర్శన పేరుతో కాళేశ్వరం విజిట్ కు వెళ్లింది. భారీ వర్షాలతో గోదావరికి పెద్ద ఎత్తున వరద వస్తుంటే మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది బీఆర్ఎస్ ఆరోపణ. ప్రభుత్వం రాజకీయంతో కాకుండా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని వినియోగించుకోవాలని డిమాండ్ చేస్తుంది. అంతే కాదు ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం స్పందించకుంటే తామే రైతులతో కలిసి కాళేశ్వరం గేట్లు ఎత్తుతామని కూడా అల్టిమేటమ్ జారీ చేసింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇలా బీఆర్ఎస్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలింపును స్టార్ట్ చేసింది. ఐతే ఇక్కడే కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన అల్టిమేటమ్ తోనే ప్రభుత్వం నీటిని తరలిస్తుందని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. దీనికి కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ విఫలమైనట్లుగా సొంత పార్టీలోనే టాక్. అంతే కాదు అసలు బీఆర్ఎస్ కు ఈ విషయంలో ఎందుకు అవకాశం ఇచ్చినట్లు అని పార్టీలో అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ముందే మనం నీటిని విడుదల చేసి ఉంటే అయిపోయేది కదా ఎందుకు బీఆర్ఎస్ అక్కడి వెళ్లే వరకు అవకాశం ఇచ్చినట్లు కాంగ్రెస్ లో ఓ వర్గం చెవులు కొరుక్కుంటున్నారు. అసలు ఇంతకీ కాళేశ్వరం విషయంలో మన పార్టీ స్టాండ్ ఏంటనేది తమకే అర్థం కావడం లేదనేది కాంగ్రెస్ నేతల వాదన. కాళేశ్వరం విషయంలో పార్టీ ఏదో ఒక స్టాండ్ తీసుకోకపోతే అది మనకు రాజకీయంగా నష్టం జరిగే అవకాశం లేకపోలేదనేది సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మొన్నటి సమ్మర్ సీజన్ లో కొండ పోచమ్మ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే విషయంలో కూడా ఇలానే జరిగిందని. అప్పుడు కూడా మాజీ మంత్రి హరీష్ రావు నీటిని తక్షణమే విడుదల చేయాలని లేకపోతే రైతులతో కలిసి తామే విడుదల చేస్తామని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే నీటిని విడుదల చేశారని ఇవన్నీ కూడా పార్టీకీ నష్టం చేకూర్చేలా ఉన్నాయనేది వారి వాదన. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీరు పారలేదని కాంగ్రెస్ మంత్రులే స్టేట్ మెంట్లు ఇస్తారు. అదే సమయంలో నీటి విడుదల చేసిన తరువాత వేల ఎకరాలకు ఈ రోజు నీరు విడుదల చేశామని చెబుతారు. ఇలా కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పరస్పర విరుద్ద ప్రకటనలు చేయడం పార్టీలో గందరగోళంకు గురి చేస్తుందని చెబుతున్నారు. అసలు కాళేశ్వరం విషయంలో సీరియస్ గా ఒక నిర్ణయానికి రావాల్సి ఉందనేది కాంగ్రెస్ లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిని ఇలా వదిలేస్తే రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరగడం ఖాయం అని పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరి కొందరు నేతలు మాత్రం దీని అంతటికి అధికారులే కారణమని అంటున్నారట. కొంత మంది అధికారులు ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వడం లేదని ఇన్ సైడ్ టాక్ . అధికారులకు , మంత్రులకు మధ్య గ్యాప్ తో పార్టీకీ నష్టం జరుగుతుందనేది వారి అభిప్రాయం.
మరోవైపు కాంగ్రెస్ పై సొంత పార్టీ నేతల వాదన ఇలా ఉంటే బీఆర్ఎస్ కూడా రివర్స్ ఎటాక్ పెంచుతుంది. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ కావాలనే బద్నాం చేస్తుందని ఆరోపిస్తుంది. కాళేశ్వరాన్ని రాజకీయాలకు వాడుకొని రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందనేది బీఆర్ఎస్ వాదన. అంతే కాదు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీలో కాంగ్రెస్ కుట్ర ఉందనే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగక భవిష్యత్తులో ప్రాజెక్టుకు ఇద్దరి మంత్రుల వల్ల సమస్యలు వచ్చినా రావచ్చని దాని వెనుక వారి ప్రయోజనాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడంలో బీఆర్ఎస్ ఒకింత సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ డిఫెన్స్ లో పడడంతో ఇదే సరైన తరుణంగా భావించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పై రివర్స్ ఎటాకింగ్ చేస్తుంది. దీంతో కాంగ్రెస్ సెల్ప్ గోల్ చేసుకుంటుందా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.
మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు అంశం గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అడ్వంటేజ్ , బీఆర్ఎస్ కు డ్యామేజ్ కాగా ఇప్పుడు అదే అంశం రెండు పార్టీలకు మరో సారి రాజకీయం అంశంగా మారింది. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి ...కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది..బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter