తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2018 విశేషాలివే..!

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 

Last Updated : Mar 15, 2018, 01:36 PM IST
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2018 విశేషాలివే..!

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. ఇది ఐదో బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం సంక్షేమ రంగానికి కూడా భారీగా నిధులు కేటాయించింది.

అలాగే ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. అదేవిధంగా మహిళల సంక్షేమానికి కూడా ఈ బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే కేటాయింపులు చేశారు.తెలంగాణ మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ. 1,74,453.84 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లుగా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇందులో రాష్ట్ర ఆదాయం రూ. 73,751 కోట్లు, కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు. 2018-19 నాటికి మొత్తం ప్రభుత్వం రుణాలు రూ. 1,80,238 కోట్లు. 

కేటాయింపులు జరిగాయి ఇలా
విద్యారంగం - సాంకేతిక విద్యా శాఖకు రూ. 95 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు రూ. 10,830 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యారంగానికి రూ. 2,448 కోట్లు కేటాయించగా..గురుకులాలకు పాఠశాలలకు రూ. 2,823 కోట్లు, మైనార్టీ గురుకులాలకు రూ. 735 కోట్లు కేటాయించారు. అలాగే ఎస్సీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు రూ. 1,221 కోట్లు, ఎస్టీ రెసిడెన్షియల్ సంస్థలకు రూ. 401 కోట్లు కేటాయించారు. ఇక బీసీ రెసిడెన్షియల్ సంస్థలకు రూ. 296 కోట్లు కేటాయించారు

కులాల సంక్షేమం - రజకుల ఫెడరేషన్ కు రూ. 200 కోట్లు కేటాయించగా.. నాయిబ్రహ్మణ ఫెడరేషన్ కు రూ. 250 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించారు.ఎస్సీ ప్రగతి నిధికి రూ. 16,453 కోట్ల ప్రత్యేక నిధి కేటాయించారు. ఎస్టీ ప్రగతి నిధికి రూ. 9,693 కోట్లు కేటాయించారు. ఎస్సీల సంక్షేమానికి రూ. 12,709 కోట్లు కేటాయించారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీని రూ. 1469 కోట్లు కేటాయించారు. అలాగే ఎస్టీల సంక్షేమానికి రూ. 8,063 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ. 5,920 కోట్లు కేటాయించారు. మైనార్టీల సంక్షేమానికి రూ. 2,500 కోట్లు కేటాయించారు. 

మహిళా సంక్షేమం - గర్భిణీల సంక్షేమానికి రూ. 561 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఆరోగ్య లక్ష్మీ పథకానికి రూ. 298 కోట్లు కేటాయించింది.  కల్యాణలక్ష్మీ పథకం కోసం, ముస్లిం మహిళలకు షాదీ ముబారక్ పథకాలకు గాను రూ. 1450 కోట్లు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమానికి రూ. 1799 కోట్లు కేటాయించారు. 

ఆలయాల అభివృద్ధి -వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు, భద్రాచలం ఆయల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించారు. బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున కేటాయింపు కేటాయించారు. యాదాద్రి అభివృద్ధికి రూ. 250 కోట్లు కేటాయించారు

ఉద్యోగుల సంక్షేమం - ఉద్యోగుల సంక్షేమానికి రూ. 1,023 కోట్లు కేటాయించగా, జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 75 కోట్లు, న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించారు. వీ-హబ్ కు రూ. 15 కోట్లు కేటాయించారు. కొత్త కలెక్టరేట్ లు, పోలీసు కార్యాలయాలకు రూ. 500 కోట్లు కేటాయించారు

పరిశ్రమల అభివృద్ధి - కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 109 కోట్లు కేటాయించారు. చేనేత జౌళి రంగానికి రూ. 1200 కోట్లు కేటాయించారు. 

శాఖల అభివృద్ధి -హోంశాఖకు రూ. 5,790 కోట్లు కేటాయించారు. సాంస్కృతిక శాఖకు రూ. 58 కోట్లు కేటాయించగా, ఆర్ అండ్ బీకి రూ. 5,575 కోట్లు కేటాయించారు. పరిశ్రమల శాఖకు రూ. 1,286 కోట్లు, ఐటీ శాఖకు రూ. 289 కోట్లు, పురపాలక శాఖకు రూ. 7,251 కోట్లు కేటాయించారు. వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 7,375 కోట్లు, విద్యాశాఖకు రూ. 10,830 కోట్లు కేటాయించారు.పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు కేటాయించారు. 

గ్రామీణ రంగం - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,563 కోట్లు  కేటాయించారు. మిషన్ భగీరథకు రూ. 1,081 కోట్లు కేటాయించారు. నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు కేటాయించారు. రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు కేటాయించగా, పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయించారు.బిందు తుంపర సేద్యం రూ. 127 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు కేటాయించారు. గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1500 కోట్లు కేటాయించారు

కార్పొరేషన్లకు నిధులు - ఎంబీసీ కార్పొరేషన్ కు రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు కేటాయించారు. 

ఇతర కేటాయింపులు - డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. 

Trending News