ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు రన్నింగ్ కార్ల నుండి దూకి.. ఆ తర్వాత అదే రన్నింగ్ కారుతో సమానంగా డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను వాట్సప్‌లో, ఫేస్ బుక్‌లో షేర్ చేయడం చూస్తున్నాం. ఈ విధానానికి వారు కికీ ఛాలెంజ్ అని పేరు పెట్టుకున్నారు. అయితే ఇదే ఛాలెంజ్ స్వీకరించడం కోసం రన్నింగ్ కార్లలో నుండి దూకి పలువురు గాయపడడం, మరణించడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇలాంటి కికీ ఛాలెంజ్‌లు చేయడానికి ప్రయత్నించే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ఇదే కికీ ఛాలెంజ్ ద్వారా ఏదైనా మంచి పని చేయాలని భావించారు కొందరు యువకులు.
అదే కికీ ఛాలెంజ్‌ని వ్యవసాయానికి ముడిపెడుతూ ఓ వీడియోని తీశారు. ఆ వీడియోలో కారు బదులుగా పొలాన్ని దున్నే ఎద్దులను ఉపయోగించారు. తాము కూడా పొలం దున్నుతూ తమకు తోచిన విధంగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత అందరూ ఇలాగే పొలం దున్నుతూ డ్యాన్స్ చేసి ప్రపంచానికి రైతుల ఔన్నత్యం గురించి చాటమని కూడా అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సప్‌తో పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసి కికీ ఛాలెంజ్‌ని ఇలా కూడా చేస్తారా..? అని ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు.
"మై విలేజ్ షో" పేరుతో ప్రారంభమైన ఓ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని పోస్టు కూడా చేశారు. తెలంగాణలోని పల్లె సంప్రదాయాలకు సంబంధించిన వీడియోలను ఈ ఛానల్లో పోస్టు చేసే శ్రీకాంత్ అనే ఔత్సాహిక దర్శకుడు.. ఈ ఎద్దులబండి కికీ ఛాలెంజ్ వీడియోని కూడా ఛానల్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కికీ ఛాలెంజ్ చేసిన వ్యక్తి అనిల్ సిద్ధిపేటలో టీచర్‌గా పనిచేస్తుండగా.. ఇదే వీడియోలో నటించిన ఆయన స్నేహితుడు వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుతం అసలైన కికీ ఛాలెంజ్ కన్నా.. ఈ తెలంగాణ కికీ ఛాలెంజ్‌కు వస్తున్న రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది సుమా..!