అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను శుక్రవారం విచారణకు స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం.. ఎలక్షన్ కమిషన్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి షో కాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని గడవు విధించింది.
ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో లక్షల మంది ఓటు హక్కుకోల్పోతారని సిద్ధిపేటకు చెందిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో సుమారు 20లక్షల మంది యువతకు ..ఓటుహక్కు దక్కకుండా పోతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో 2018, జనవరి1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిందని... ఎన్నికలు సరైన సమయంలో జరిగితే వారు సైతం ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉండేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
పిటిషన్ లో పేర్కొన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత ధర్మాసనం... దీనిపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఈసీలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా సుప్రీంకోర్టు నోటీసులపై టి.సర్కార్, ఎలక్షన్ కమిషన్ ఏ మేరకు స్పందిస్తాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.