తనకి తెలియకుండానే తన భర్త శ్రీనివాస్ రెడ్డి మరో పెళ్లి చేసుకోవడంతోపాటు తనని ఇంటి నుంచి బయటికి గెంటేశాడంటూ సంగీత అనే మహిళ గతేడాది నవంబర్‌లో హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బోడుప్పల్‌లోని తన అత్తగారింటి ముందే న్యాయపోరాటానికి దిగిన సంగీత అక్కడే నిరాహారదీక్ష చేపట్టడం అప్పట్లో పతాక శీర్షికలకు ఎక్కింది. భర్తపై న్యాయపోరాటం చేస్తున్న సంగీతకు స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, స్థానిక ఎంపీ మల్లా రెడ్డి సహా పలు మహిళా సంఘాల నేతలు బాసటగా నిలిచారు. సంగీత రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అప్పట్లో శ్రీనివాస్ రెడ్డి సహా అతడి తల్లిదండ్రులని అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు ఈ గృహ హింస కేసు మియాపూర్ ఫ్యామిలీ కోర్టులో విచారణకు వచ్చింది.
ఈ కేసులో కోర్టు ఎదుట విచారణకు హాజరైన సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి.. కోర్టు ఆదేశాల మేరకు ఆమెని తన ఇంట్లోకి అనుమతిస్తానని కోర్టుకి హామీ ఇచ్చారు. అయితే, అంతకన్నా ముందే సంగీత చేసిన విజ్ఞప్తిని పరిగనణలోకి తీసుకున్న కోర్టు.. ఆమెకి ప్రతీ నెల రూ.20,000 భరణంగా చెల్లించాల్సిందిగా శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై స్పందించిన శ్రీనివాస్ రెడ్డి.. తాను తన భార్య సంగీతని ఇంట్లోకి అనుమతించడానికి సిద్ధంగా వున్నాను కనుక ఇక ఆమెకు నెల నెలా భరణం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆదేశాలని పునసమీక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కౌంటర్ దాఖలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి కౌంటర్‌పై కోర్టు ఏమని స్పందిస్తుందనేది వేచిచూడాల్సిందే.