తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి శనివారం విజయవాడలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో కలసి మాట్లాడిన అనంతరం ఆయన, తన రాజీనామా లేఖను పార్టీ కార్యదర్శికి అందించారు. కొంతకాలంగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని విషయాలు తనను మనస్తాపానికి గురిచేశాయని.. అయితే టీడీపీ అధిష్టానంపై తనకు గౌరవం ఉందని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు తాను తెలంగాణలో అవినీతికి పాల్పడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే, ఏపీ నేతలు మాత్రం అదే పార్టీ నేతలతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని ఆ లేఖలో తెలిపారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం టీడీపీ నేతలలో వివాదానికి దారితీసింది. ఆయన తప్పకుండా కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో విజయవాడలో తెలంగాణ టీడీపీ నేతలను వచ్చి కలవాల్సిందిగా చంద్రబాబు కోరారు. చంద్రబాబును విజయవాడలో కలిసిన రేవంత్‌రెడ్డి ఆ తర్వాత తన రాజీనామాని సమర్పించారు. అయితే రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ తనకు అందలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రేవంత్‌రెడ్డి వ్యవహారంపై చర్చించేందుకు పార్టీ తెలంగాణ నేతలతో మళ్లీ చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం.