Re-postmortem for dead bodies of Disha case accused : దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం.. మృతదేహాల అప్పగింత

దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఎన్‌కౌంటర్‌కి గురైన నలుగురు నిందితుల మృతదేహాలకు సోమవారం రీపోస్టుమార్టం ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం ఈ రీపోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం ప్రక్రియ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ముగిసింది. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు. సాయంత్రం గంటన్నర లేపే అంత్యక్రియలు పూర్తయ్యాయి.  

Last Updated : Dec 24, 2019, 12:16 PM IST
Re-postmortem for dead bodies of Disha case accused : దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం.. మృతదేహాల అప్పగింత

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఎన్‌కౌంటర్‌కి గురైన నలుగురు నిందితుల మృతదేహాలకు సోమవారం రీపోస్టుమార్టం ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం ఈ రీపోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొంది. నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించిన తర్వాతే రీపోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం ప్రక్రియ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ముగిసింది. అనంతరం తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారమే నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రీపోస్టుమార్టం ప్రక్రియను ఎయిమ్స్ వైద్యులే స్వయంగా వీడియో తీశారు. ఈ వీడియోను రెండు రోజుల్లో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌‌కు అప్పగించనున్నట్లు ఎయిమ్స్ వైద్యుల బృందం తెలిపింది. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం అధిపతి సుధీర్ గుప్తాతో పాటు అభిషేక్ యాదవ్, ఆదర్శ్ కుమార్ వైద్య బృందం రీపోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొంది.

రీపోస్టుమార్టం ప్రక్రియపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ జీ హిందుస్థాన్ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రీపోస్టుమార్టం జరిగినట్లు  తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన నలుగురు డాక్టర్ల వైద్య బృందం దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. రీపోస్టుమార్టం ప్రక్రియ అంతా కూడా ఎయిమ్స్ వైద్యులే వీడియో చిత్రీకరించినట్టు డాక్టర్ శ్రవణ్ తెలిపారు. రీపోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్‌లో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఎయిమ్స్ వైద్యులు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. రీపోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి నుంచి రెండు ప్రత్యేక అంబులెన్స్‌లలో నిందితుల మృతదేహాలను తరలించారు.

గంటన్నర లోపే అంత్యక్రియలు పూర్తి.. 

నిందితుల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకోగానే .. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. సాయంత్రం గంటన్నర లోపే అంత్యక్రియలు పూర్తి  చేయడం విశేషం. అవివాహితులైన శివ, నవీన్ మృతదేహాలకు వారి కుటుంబ సభ్యులు ఇంటి ముందు పందిళ్లు వేసి .. కత్తితో వివాహం జరిపించారు. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. స్థానిక మసీదులో ప్రార్థనలు చేసిన అనంతరం ఆరిఫ్ మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేశారు. చెన్నకేశవులు మృతదేహాన్ని చూసి అతని భార్య భోరున విలపించింది.  

 

Trending News