ఈ నెల 20వ తేదిన రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన

ఈ నెల 20వ తేదిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.

Last Updated : Oct 14, 2018, 11:26 PM IST
ఈ నెల 20వ తేదిన రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన

ఈ నెల 20వ తేదిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన ఆ పర్యటన సందర్భంగా రెండు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. డిసెంబరు 7వ తేది నుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతున్న క్రమంలో ఆయన తెలంగాణ ప్రజలకు తన సందేశం ఇవ్వనున్నారు. ఈ పర్యటన సందర్భంగా చార్మినార్ కూడలిలో రాహుల్ కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి రంగం సిద్ధమైంది.

ఈ పర్యటన వేడుక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌తో పాటు పలువురు ఏపీ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో మాజీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర పురస్కారంతో సత్కరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే రాహుల్ సభలో మాట్లాడాక.. ఆదిలాబాద్ జిల్లాలోని  భైంసా ప్రాంతాన్ని సందర్శిస్తారు. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా పర్యటిస్తారు. ఏఐసిసి తెలంగాణ ఇంఛార్జి ఆర్ సి కుంతియాతో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... రాహుల్ పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. 

ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో కలిసి... ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే మహాకూటమి పేరుతో ప్రారంభమైన ఈ అలయెన్స్.. ప్రజాకూటమిగా పేరు మార్చుకుంది. అయితే ఈ ప్రజాకూటమికి సంబంధించి సీట్ల పంపకం విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలన్న అంశంపై ఇంకా సందేహాలు నాయకులను వదలడం లేదు. ఇటీవలే కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సీట్ల కేటాయింపుల విషయంలో ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

Trending News