హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఇంటర్మీడియెట్ బోర్డు వైఫల్యాల కారణంగా సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం అని టీ మాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటర్ ఫలితాల వెల్లడి అనంతరం చోటుచేసుకున్న వరుస పరిణామాలపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్యను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియెట్ విద్యా పద్ధతిని రద్దు చేసి 12వ తరగతి వరకు హైస్కూల్ విద్యలో కలపాలని, 2019-2020 అకాడమీ నుంచే 11వ తరగతిని ప్రారంభించాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య కోరారు. ఇంటర్మీడియెట్ విద్య ఒక దందాగా మారడంతోపాటు ఇంటర్ బోర్డు నిర్వాకాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి చిన్నాభిన్నమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విలేకరుల సమావేశంలో టి మాస్ ఫోరం రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య మాట్లాడుతూ 20 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మంత్రి జగదీశ్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.