Munugodu Byelection: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనున్నారన్న వార్తలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీపైనల్ గా మారడంతో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. హుజురాబాద్ ఓటమితో షాకైన అధికార టీఆర్ఎస్ పార్టీ.. మునుగోడు ఉపఎన్నికను సవాల్ గా తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్యనేతలు మునుగోడు విషయంలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రగతిభవన్ లో జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. పీకే టీమ్ ద్వారా నియోజకవర్గం నుంచి పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారట గులాబీ బాస్.నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామాన్ని కవర్ చేస్తూ పీకే టీమ్ మునుగోడుపై కేసీఆర్ కు నివేదిక ఇచ్చిందని సమాచారం. పీకే టీమ్ సర్వే ఆధారంగానే కేసీఆర్ యాక్షన్ ప్రారంభించారని, అందులో భాగంగానే ఏడేళ్లుగా పెండింగులో ఉన్న గట్టుపల్ల్ మండలానికి మోక్షం కల్గిందని తెలుస్తోంది. నియోజకవర్గంలోని మరిన్ని సమస్యలను గుర్తించి పరిష్కరించే పనిలో పడింది అధికార పార్టీ.
నియోజకవర్గ సమస్యలతో పాటు బలమైన అభ్యర్థి ఎవరనే విషయంలోనూ కేసీఆర్ పూర్తిస్థాయిలో కసరత్తు చేశారని తెలుస్తోంది.మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ గా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన.. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఆయన వ్యవహార శైలే 2018లో పార్టీ కొంప ముంచిందని... రాష్ట్రమంతా కారు హవా వీచినా మునుగోడులో ఓడిపోవడానికి ఆయన తీరే కారణమనే టాక్ ఉంది. అయితే ఓడిపోయినా ఆయన తీరు మారలేదంటున్నారు. సొంత పార్టీ నేతలే ఆయనను తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఆయనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ లో మరో బలమైన వర్గం తయారైంది. నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఇద్దరు మున్సిపల్ చైర్మెన్లు, ఐదుగురు జడ్పీటీసీలు, ఐదుగురు ఎంపీపీలు ఉన్నారు. వీళ్లలో ఒకరిద్దరు తప్ప అంతా కూసుకుంట్ల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన నియోజకవర్గానికి వచ్చినా పట్టంచుకోవడం లేదు. ఈ విషయం గ్రహించిన కూసుకుంట్ల.. తాను సొంతంగా వస్తే ఎవరూ వచ్చే పరిస్థితి లేకపోవడంతో... మంత్రి జగదీశ్ రెడ్డిని నియోజకవర్గానికి రప్పిస్తున్నారని చెబుతున్నారు.
పీకే టీమ్ సర్వేలోనూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపితే పార్టీ నష్టమని తేలిందని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ మరో అభ్యర్థి కోసం సర్వే చేయించారని టీఆర్ఎస్ వర్గాల సమచారం. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ జోరుగా జనంలోకి వెళుతున్నారు. అయితే మునుగోడు నియోజకవర్గంలో రెడ్డీలదే ఆధిపత్యమైనా దాదాపు 60 శాతం మంది బీసీ ఓటర్లున్నారు. ఇక్కడ బీసీ వాదం బలంగా ఉంది. అందుకే బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉందని తెలుస్తోంది. బీసీ కోటాలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మునుగోడు జడ్పీటీసీ భర్త నారబోయిన రవి ముదిరాజ్, మరో బీసీ నేత కర్నాటి విద్యాసాగర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బూరను మళ్లీ భువనగిరి ఎంపీ బరిలో దింపాలని.. ఆ దిశగా ఆయనకు కేసీఆర్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సామాజిక వర్గం చాలా తక్కువ. దీంతో ఆయనకు కూడా రాష్ట్రస్థాయిలోనే పదవి ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. మునుగోడుకు చెందిన నారబోయిన రవి సామాజిక వర్గం నియోజకవర్గంలో బలంగా ఉంది. కొన్ని రోజులుగా ఆయన జనంలో బాగా తిరుగుతున్నారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో ఎవరు కష్టాల్లో ఉన్నా తనకు తోచిన సాయం చేస్తూ ఆదుకుంటున్నారు.
ఆర్థికంగానూ బలంగా ఉన్న నారబోయిన రవి మునుగోడు టీఆర్ఎస్ టికెట్ రేసులో ముందున్నారని తెలుస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి అండదండలు కూడా ఆయనకు ఉన్నాయంటున్నారు. కూసుకుంట్ల వ్యతిరేక వర్గం నేతలు కూడా నారబోయినకు మద్దతు ఇస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. కూసుకుంట్లకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని అసమ్మతి నేతలు మంత్రి జగదీశ్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ రేసులో ఉన్న విద్యాసాగర్ సామాజిక వర్గం బలంగానే ఉన్నా.. ఆయన నియోజకవర్గ నేతలతో పెద్దగా పరిచయాలు లేవు. ఇది కూడా నారబోయినకు కలిసివస్తుందని చెబుతున్నారు. పీకే టీమ్ సర్వేలోనూ నారబోయిన రవి రేసులో ముందున్నారని తెలుస్తోంది. మొత్తంగా మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే అధికార పార్టీ అభ్యర్థిగా ఈసారి కొత్త ముఖం ఉండటం ఖాయమని టీఆర్ఎస్ కేడర్ చెప్పుకుంటోంది.
Also read:Shyja Moustache: మీసమున్న మహిళ.. 'చురకత్తి' లాంటి ఆ మీసాలు లేకుండా జీవితాన్నే ఊహించుకోలేదట..
Also read:Mohanbabu: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ అందుకే.. అసలు విషయం చెప్పేశారు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook