హన్మకొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగల వ్యతిరేకి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ కేబినెట్‌లోకి ఒక్క దళిత ఎమ్మేల్యేనూ తీసుకోకపోవడం ద్వారా ఆయన ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేశారని మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన కేసీఆర్‌ను హెచ్చరించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలకు మంత్రిపదవులు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ సోమవారం హన్మకొండలో ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనకు ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలు, ఉపకులాల తమ మద్దతు పలికాయి.
కేసీఆర్‌కి వ్యతిరేకంగా ధర్నా సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో రెండో స్థానంలో నిలిచిన అరూరి రమేష్‌కి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా మాదిగలకు మంత్రి పదవి డిమాండ్‌తో శనివారం వరకు మాదిగలు ఆందోళనలు చేపట్టాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు సైతం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.