తెలంగాణలో ఇక వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

  

Last Updated : Nov 16, 2018, 02:35 PM IST
తెలంగాణలో ఇక వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ 2002 చట్టం ప్రకారం తెలంగాణలోని గ్రామాల్లో జరిగే వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు గ్రామాల్లో ప్రకటన ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే అమ్మాయిలకు సంబంధించిన విద్యార్హతలు, వయసు లాంటి విషయాలపై తగిన విచారణ చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు చేయాలన్న సంకల్పం ఉన్న తల్లిదండ్రులు కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయడం లేదని.. అలాంటి వారు చట్టరీత్యా శిక్షార్హులని ప్రభుత్వ కార్యదర్శి తెలిపారు.

బాల్యవివాహాలను నివారించేందుకు ప్రభుత్వం అమ్మాయిలకు కనీస వయస్సు 18  సంవత్సరాలుగా నిర్థారించడం జరిగిందని.. అంతకంటే తక్కువ వయసు గల అమ్మాయిలకు వివాహం చేస్తే పురోహితుడితో పాటు పెళ్లి చేయించినవారు, తల్లిదండ్రులు అందరూ కూడా శిక్షార్హులు అవుతారని తెలిపారు. బాల్య వివాహాలు జరిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసే విధంగా.. గ్రామాలలో అవగాహన శిబిరాలు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. 

కళ్యాణలక్ష్మి పథకం రాష్ట్రంలోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన పథకం.  2017-18 తెలంగాణ బడ్జెట్‌లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51000 నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19 తేదిన ఇదే మొత్తాన్ని రూ.1,00,116 కు ప్రభుత్వం పెంచడం జరిగింది. కళ్యాణలక్ష్మి పథకం క్రింద లబ్ది పొందే అమ్మాయిల కుటుంబం వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు అన్నది ప్రభుత్వ నిబంధన.

Trending News