House Collapsed: కామారెడ్డి ఎమ్మెల్యే సంచలనం.. రోడ్డు కోసం తన ఇల్లునే కూల్చేశాడు

Kamareddy: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేతలను ఓడించి సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఏమైనా చేస్తానని చెబుతూ తన ఇంటినే కూల్చేసుకున్నారు. రోడ్డు నిర్మాణంలో అడ్డుగా ఉందని చెబుతూ తన ఇంటిని కూల్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 27, 2024, 07:06 PM IST
House Collapsed: కామారెడ్డి ఎమ్మెల్యే సంచలనం.. రోడ్డు కోసం తన ఇల్లునే కూల్చేశాడు

Kamareddy MLA: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఓడించి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలనం రేపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కామారెడ్డిలో రోడ్డు విస్తరణ కోసం ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు పనులకు అడ్డంకిగా ఉన్న తన ఇల్లును ఎమ్మెల్యే కూల్చివేయించారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో రోడ్ల విస్తరణపై దృష్టి సారించారు. రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా ఉందని గుర్తించి ఆ ఇంటిని ఖాళీ చేశారు. మరో ఇంటిలోకి మారిన వెంకటరమణారెడ్డి తన పాత ఇంటిని కూల్చాలని నిర్ణయించారు. శనివారం ఇంటిని కూల్చివేసే పనులు ప్రారంభించారు. జేసీబీ సహాయంతో ఇంటిని అధికారులు కూల్చారు.  ఈ పనులను స్వయంగా ఆయన పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 'కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్డు నిర్మాణంలో నా ఇంటిని కూల్చడం గొప్ప విషయం కాదు. మా ఇంటి కూల్చడం ద్వారానే మార్పు మొదలుపెట్టాం. నన్ను చూసి ప్రజలు కూడా రోడ్డు వెడల్పుకు సహకరించాలని కోరుతున్నా. ఎవరినీ ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు' అని స్పష్టం చేశారు.

కామారెడ్డిలో రోడ్ల విస్తరణ వేగవంతం
జిల్లా కేంద్రంగా ఏర్పడిన కామారెడ్డిలో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. పట్టణం కూడా రోజురోజుకు విస్తరిస్తోంది. ఇటీవల కామారెడ్డి పట్టణ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. అయితే పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాస్టర్‌ప్లాన్‌ ప్రభావం కనిపించింది. ఫలితంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కామారెడ్డి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకటరమణారెడ్డి కూడా మాస్టర్‌ ప్లాన్‌కు మద్దతు పలుకుతున్నారు. పట్టణ అభివృద్ధికి స్థానికులు సహకరించాలని కోరుతూ ఇప్పుడు తన ఇంటిని కూల్చేసుకున్నారు. కలెక్టరేట్‌కు వెళ్లే ఈ రోడ్డును విస్తరించాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. నెల రోజుల్లో కూల్చివేతలు ప్రారంభించి అనంతరం రోడ్డు పనులు వెంటనే చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Also Read: Governor Protest: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని గవర్నర్‌ ధర్నా.. మీరెందుకు అంటూ పోలీసులపై ఆగ్రహం

Also Read: Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News