Telanagana Floods: తెలంగాణలో కుండపోత వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గంటల వ్యవధిలోనే 20 సెంటిమీటర్లకు పైగా వర్షం కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది.ఇప్పటికే చెరువులన్ని నిండుకుండలా మారి మత్తడి పోస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో తెలంగాణలో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. ఊహించని స్థాయిలో వరద వస్తుండటంతో పలు ప్రాజెక్టుల దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి రికార్డు స్థాయిలో వరద వస్తుండటంతో ప్రమాదంలో పడింది. అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీగా వస్తున్న ఇన్ ఫ్లోతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో కడెం వాసులు వణికిపోతున్నారు.
కడెం ప్రాజెక్టుకు 1995లోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు ఊహించని వరద రావడంతో ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. కడెం గ్రామాన్ని వరద ముంచెత్తింది. అధికారుల హెచ్చరికలతో స్థానికులు గ్రామాన్ని వదిలి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 4 లక్షల 97 వేల 413 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు మొత్తం 17 గేట్లను పూర్తిగా ఎత్తి 2 లక్షల 99 వేల 047 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు, ప్రస్తుతం 698.700 అడుగులు ఉంది. కడెం ప్రాజెక్టు కెపాసిటీ కి మించి వరద వస్తుండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు.అప్రమత్తమైన అధికారులు కడెం ప్రాజెక్టుకి రెడ్ అలర్ట్ జారీ చేశారు.
డ్యామ్ గేట్లు పూర్తిగా ఎత్తినా.. వరద గేట్ల పై నుంచి వెళుతోంది. వరద పెరిగితే ఏ క్షణంలో అయినా డ్యామ్ కూలిపోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ కింది ప్రాంతంలో ఉన్న వారందరినీ తరలిస్తున్నారు. కడెం ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలోని 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్ట్ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ మైసమ్మ గుడి వద్ద గండిపడే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. పాండవాపూర్ చెక్ పోస్టు వద్ద ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. NDRF బృందాల సహాయం కోరారు అధికారులు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్ట్ కు చేరుకుని పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు ప్రమాదకర స్థితిలో వరదనీరు చేరుకుంటుందని మంత్రి చెప్పారు. కడెం పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. ఎగువ ప్రాంతంలో ఇటు ఎస్సారెస్పీ నుంచి అటు బోథ్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులను సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు తగ్గితేనే వరద నీటి ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయిని వెల్లడించారు. ఇప్పటికైతే కొద్దిగా వరద నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు.
గత 24 గంటల్లో కడెం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో గత 24 గంటల్లో కుండపోతగా వర్షం కురిసింది. కొమరం భీమ్ జిల్లా జైనూరులో రికార్డ్ స్థాయిలో 39 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కెరిమెరిలో 38, సిర్పూరులో 35 సెంటిమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో 29, ఎలగైడ్ 25 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook