హైదరాబాద్: ''నా భర్తను ఎక్కడైతే ఎన్‌కౌంటర్ చేశారో.. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లి కాల్చిచంపండి. మా ఇద్దరికీ పెళ్లయి ఏడాదే అవుతోంది. ఇప్పుడు మా ఆయన లేకుండా నేనుండలేను''. దిశ హత్య కేసులో నిందితుడిగా ఉండి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన ఇది. ఇప్పుడామె గర్భవతి కూడా. చెన్నకేశవులు తల్లి మాట్లాడుతూ.. ''వాళ్లు మాకు కొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. అరెస్ట్ అయిన తర్వాత 14 రోజులకు తిరిగి వారిని కలుసుకునే అవకాశం ఉంటుందని మాకు చెప్పారు. కానీ అరెస్ట్ అయి ఇవాళ్టికి 8 రోజులే. ఇలా నీ కొడుకును చంపేస్తామని మాకెవరైనా చెప్పారా ? ఏదేమైనా వాళ్లు మాకు ఓసారి చెప్పి ఉండాల్సింది. మాకు సమయం ఇచ్చి ఉంటే.. నా కొడుకు చనిపోయేలోపు వాడినొక్కసారైనా కలిసే అవకాశం వచ్చుండేది. నా కొడుకును జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టినా ఏం కాకపోయుండేది కానీ ఇలా చంపి ఉండాల్సింది కాదు'' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై చింతకుంట చెన్నకేశవులు భార్య, తల్లి కన్నీటి వేధన ఇది. తప్పు చేసిన చెన్నకేశవులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా.. చెడు స్నేహాలు చేసిన కొడుకును పోగొట్టుకున్న బాధ అతడి తల్లికి, పెళ్లయిన ఏడాదికే భర్తను కోల్పోయిన బాధ అతడి భార్యకు మిగిలింది.
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ తల్లిదండ్రుల ఆవేదన సైతం అంతే వర్ణనాతీతంగా ఉంది. కొడుకు ఆరిఫ్ చేయకూడని తప్పిదం చేసి ఎన్‌కౌంటర్‌లో కన్నుమూయగా.. కన్నకొడుకు దూరమయ్యాడనే బాధ మాత్రమే ప్రస్తుతం ఆ తల్లిదండ్రులకు మిగిలింది. ఇదే విషయమై మీడియా ఆమెను కదిలించగా.. కన్నకొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తాను మీకు చెప్పడానికి ఇంకేం ఉంటుందంటూ బోరున విలపించారు. రోజూ కూలీనాలీ చేసుకునే బతికేటోళ్లం... ఇప్పుడు ఏం చేసి బతకాలి ? ఊర్లో వాళ్లు ఏమంటారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఆరిఫ్ తల్లి.. అసలు ఆరిఫ్ ఇలా తయారవ్వడానికి అతడి చెడు స్నేహాలే కారణమని ఆరిఫ్ స్నేహితులపై దుమ్మెత్తిపోశారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న జొళ్లు శివ, జొళ్లు నవీన్ తల్లిదండ్రుల పరిస్థితి సైతం అలాగే ఉంది. తప్పు చేసిన శివ, నవీన్ ఇద్దరూ శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా.. చెడు స్నేహాల కారణంగా చెడిపోయిన కన్నకొడుకుల్ని పోగొట్టుకున్న దుఖం మాత్రమే ఆ తల్లిదండ్రులకు మిగిలింది. జొళ్లు నవీన్ తండ్రి యెల్లప్ప, జొళ్లు శివ తండ్రి రాజప్ప మాట్లాడుతూ.. ఈ కేసులో అరెస్ట్ అయిన అనంతరం తమ కొడుకులను కలిసే అవకాశం ఎందుకివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కసారైనా తమ కన్నబిడ్డలను చూసుకునే అవకాశం ఇవ్వకుండా ఎన్‌కౌంటర్ చేశారెందుకు అని ప్రశ్నించడం తప్ప.. ప్రస్తుతం ఆ నలుగురు తల్లిదండ్రులకు కానీ వారి తోబుట్టువులకు కానీ, చెన్నకేశవులు భార్యకు కానీ ఇక మిగిలిందేం లేదు.
చెడు స్నేహితులతో తిరిగి, మద్యానికి బానిసై, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియకుండా చేసే ఘోర తప్పిదాలు ఎందరి జీవితాలపై ప్రభావితం చూపిస్తాయి ? ఎవరి జీవితాలు, ఎలా నాశనం అవుతాయని చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనంగా నిలిచింది.
వాళ్లకు జైల్లో చిప్పకూడు పెట్టాల్సింది: నిందితుల కుటుంబసభ్యుల ఆవేదన