Hyderabad Cab Driver Attacked: హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్యాబ్ డ్రైవర్‌పై దాడి జరిగింది. క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్.. ట్రిప్ పూర్తయ్యాక డబ్బులు ఇవ్వకపోగా డ్రైవర్, అతని యజమానిపై దాడికి పాల్పడ్డాడు. దాదాపు 20 మంది స్నేహితులను పిలిపించి వారితో కలిసి దాడి చేశాడు. పైగా తమ పైనే దాడికి పాల్పడ్డారంటూ నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడి పరిస్థితి విషమించడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... నారాయణఖేడ్‌కి చెందిన వెంకటేశ్ (27) అనే వ్యక్తి హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జూలై 31, రాత్రి బీఎన్ రెడ్డి నుంచి ఉప్పర్‌పల్లి వరకు వివేక్ రెడ్డి (26) అనే యువకుడు వెంకటేశ్ కారు బుక్ చేసుకున్నాడు. వివేక్‌ను ఎక్కించుకునేందుకు వెళ్తూ మార్గమధ్యలో కారు యజమాని పర్వతాలును కూడా ఎక్కించుకున్నాడు వెంకటేశ్.
ఉప్పర్‌పల్లిలో వివేక్ దిగాల్సిన చోట అతన్ని డ్రాప్ చేశాడు. అయితే వివేక్ క్యాబ్ డబ్బులు రూ.600 ఇవ్వకుండా వెళ్లిపోతుండటంతో వెంకటేశ్ అతన్ని ప్రశ్నించాడు. డబ్బులు ఇవ్వకపోగా 20 మంది స్నేహితులను పిలిపించి వెంకటేశ్, పర్వతాలుపై వివేక్ దాడికి పాల్పడ్డాడు. క్రికెట్ బ్యాట్స్, వికెట్లతో ఇద్దరినీ చితకబాదారు. డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కొట్టొద్దని మొరపెట్టుకున్నా వినలేదు. పైగా తమ పైనే దాడి జరిగిందని వివేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాజేంద్ర నగర్ పోలీసులు వెంకటేశ్, పర్వతాలును అదుపులోకి తీసుకున్నారు.
దాడిలో గాయాలపాలైనవారికి చికిత్స అందించకుండా పోలీసులు వారిని రాత్రి నుంచి ఉదయం వరకు పీఎస్‌లోనే ఉంచారు. ఈ క్రమంలో వెంకటేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి బంధువులకు సమాచారమిచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్... కోమాలోకి వెళ్లాడు. అప్పుడు కానీ పోలీసులు నిందితుడు వివేక్‌పై కేసు నమోదు చేయలేదు. దీంతో వివేక్ కోర్టులో లొంగిపోగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఓ పోలీస్ కానిస్టేబుల్ సహకారం వల్లే రాజేంద్రనగర్ పోలీసులు నిందితులకు మద్దతుగా నిలిచి బాధితుల పైనే కేసు నమోదు చేశారనే ఆరోపణలు విపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే అతని ప్రాణాల మీదకు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు, దాడి సమయంలో అటుగా వచ్చిన ప్యాట్రోలింగ్ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారని.. వారి ముందే దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు మాత్రం తమపై ఆరోపణలను ఖండించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook