High Tension in Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక బీజేపీ, శివసేన నేతలు రాత్రికి రాత్రే పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ మరో వర్గం ఆందోళనకు దిగింది. వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆ వర్గం డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. నిర్మల్, కామారెడ్డిల నుంచి అదనపు బలగాలను బోధన్‌కు రప్పించారు.
పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ సీపీ నాగరాజు, జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బోధన్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శివసేన, బీజేపీ నేతలతో పాటు శివాజీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వర్గానికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
అవసరమైతే పట్టణంలో కర్ఫ్యూ విధించే అవకాశాలు లేకపోలేదని సీపీ నాగరాజు తెలిపారు. బోధన్ నలువైపుల నాలుగు పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని... పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలో ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోకి బయటివారిని ఎవరిని అనుమతించట్లేదన్నారు. ఇరు వర్గాల ప్రజలు, ఆయా పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఇరువర్గాల్లో ఎవరు తమ ఆదేశాలను అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారిపై టాడా చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు.
కలెక్టర్‌కు ఎంపీ అరవింద్ లేఖ :
బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అక్కడ శాంతియుతంగా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని కూడా కాదని టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు కొంతమంది ముస్లిం నాయకులు శివాజీ విగ్రహాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. కాబట్టి ఈ విషయంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.
Also read: Aadhaar History: మీ ఆధార్ కార్డు అక్రమంగా వినియోగమవుతుందా? తెలుసుకోండిలా..
Also read: Viral Video: కదులుతున్న ఆటో ట్రాలీ నుంచి చోరీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook