హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం ఉదయం ఓ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సహాయంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎంతో శ్రమించి మంటలు ఆర్పడంతో ఆ చుట్టు పక్కల వాళ్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనలో కొందరు తీవ్ర గాయాలతో బయటపడగా ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, మధ్యాహ్నం మంటలు ఆర్పడంతో చల్లారింది అనుకున్న అగ్ని శుక్రవారం అర్ధరాత్రికి మళ్లీ రాజుకుంది. అదే గోడౌన్‌లో అర్ధరాత్రి వేళ చెలరేగిన మంటల కారణంగా అక్కడే వున్న డ్రమ్ములు పెద్ద శబ్ధంతో పేలుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం ధాటికి ఏం జరుగుతుందో ఏమోననే భయాందోళనతో సమీపంలో వున్న గంపలబస్తీ కాలనీ వాసులు వెంటనే ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు జీడిమెట్ల ఫైర్ స్టేషన్ నుంచి అక్కడికి చేరుకున్న నాలుగు ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పేపనిలో నిమగ్నమయ్యాయి.