హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తోన్న అభ్యర్థి రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. శనివారం రాత్రి కొడంగల్ నియోజకవర్గంలో భయాందోళనలు సృష్టించిన రేవంత్‌రెడ్డి.. ఈ నెల 4న సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటానని ప్రకటించి జనాన్ని రెచ్చగొడుతున్నారని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని నివేదిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రేవంత్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఈఓ ఆదేశాలు జారీచేశారు.
రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని సైతం తమ ఫిర్యాదుతో ఈసీకి సమర్పించింది. టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్.. రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ సోమవారంలోగా తమకు వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తమ ఆదేశాల్లో స్పష్టంచేసింది. ఈసీ ఆదేశాలతో అప్రమత్తమైన డీజీపీ.. రేవంత్ రెడ్డిపై చర్యలకు పూనుకుంటున్నట్టు తెలుస్తోంది. సోమవారంలోపే ఈసీకి తిరిగి వివరణ ఇవ్వాల్సి ఉండటంతో ఏ క్షణమైనా పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి తలుపు తట్టే అవకాశం లేకపోలేదని సమాచారం.