KCR PLAN: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెప్టెంబర్ నెలతో సెంటిమెంట్ ఉంది. గతంలో సెప్టెంబర్ లో తీసుకున్న నిర్ణయాలు ఆయనకు కలిసొచ్చాయి. సెప్టెంబర్ ను తనకు సెంటిమెంట్ గా భావించే.. ఈ నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారనే టాక్ ఉంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. సెప్టెంబర్ లోనే అసెంబ్లీని రద్దు చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. ఈసారి కూడా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంలో దూకుడు పెంచారు సీఎం కేసీఆర్. జిల్లాలు చుట్టేస్తున్నారు. పెండింగ్ పనులను పరుగులుపెట్టిస్తున్నారు. కొత్త పథకాలకు ప్లాన్ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినందు వల్లే కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేపట్టారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 3న కేసీఆర్ కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజున తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు కేసీఆర్. ఒకే రోజు రెండు కీలక సమావేశాలు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చలు సాగుతున్నాయి.
సెప్టెంబర్ ౩ శనివారం జరపనున్న టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలను సైతం ఆహ్వానించారు. ఈ సమావేశానికి అందరూ తప్పనిసరిగా రావాలని కేసీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు, తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఖాళీ జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చే పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుందని తెలుస్తోంది. ఈ పథకం పర్యవేక్షణ ఎమ్మెల్యేలకు అప్పగించే యోచనలో ఉన్న కేసీఆర్.. దీనిపై పార్టీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను ఈనెల 6 నుంచి నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చిస్తారని సమాచారం. ప్రతిపక్షాలకు ధీటుగా ఎలా సమాధానం ఇవ్వాలనే అంశంపై ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం కేసీఆర్ చేయనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు,నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, జనాలు ఏమనుకుంటున్నారు.. ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్న కేసీఆర్.. ముందస్తుకు వెళితే ఎప్పుడు అసెంబ్లీని రద్దు చేయాలనే విషయంపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ రద్దు లోపు చేయాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న పెన్షన్లకు మోసం కల్గింది. కొత్త రేషన్ కార్డుల మంజూరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికపైనా కేబినెట్ సమావేశంలో మంత్రులతో, పార్టీ సమావేశంలో కేసీఆర్ చర్చించనున్నారని తెలుస్తోంది. మునుగోడులో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. మునుగోడు ఉప ఎన్నికకు వెళ్దామా లేక బైపోల్ కాకుండా నేరుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా అన్న విషయంపైనా పార్టీ నేతల అభిప్రాయాలను కేసీఆర్ తీసుకోనున్నారని సమాచారం.
కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు కేసీఆర్. ఇటీవలే 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఈనెల 31న బీహార్ లో పర్యటించారు. నితీశ్ కుమార్ తో కీలక చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాలపైనా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం. మొత్తంగా సెప్టెంబర్ 3న జరగనున్న కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ అత్యంత కీలకమని తెలుస్తోంది. కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ ఉండటంతో ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేసే అవకాశాలు లేకపోయినా అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాలి, ముందస్తుకు ఎప్పుడు వెళ్లాలి అన్న విషయాలపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
Read also: Whatsapp Case: ఇదేందయా ఇది.. వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారంటూ కేసు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook