Arvind Kejriwal Meets KCR: కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్.. లేదంటే ఉద్యమమే

Arvind Kejriwal Meets KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా పర్యటించి పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్న అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2023, 07:29 PM IST
Arvind Kejriwal Meets KCR: కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్.. లేదంటే ఉద్యమమే

Arvind Kejriwal Meets KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దాలు, అక్కడి నుంచి ముందుగా సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎదురుగా ఉన్న ఐటిసి కాకతీయ హోటల్ కి వెళ్లారు. అక్కడి నుంచి ప్రగతి భవన్‌కి చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్ అండ్ టీమ్‌కి సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు.   

దేశవ్యాప్తంగా పర్యటించి పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్న అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి, బీహార్ సీఎం నితీశ్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, తదితర నేతలను కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నేడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సును వ్యతిరేకించాల్సిన అవసరం గురించి వివరించారు. 

లంచ్ భేటీ అనంతరం జన హితలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలు, భారత సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం విరుద్ధంగా వ్యవహరిస్తోంది అని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

 

 

 

ఢిల్లీ సర్కారుని ఇబ్బందిపెట్టేందుకే తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్సును బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తోందన్న కేసీఆర్.. వెంటనే ఆ ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకోకపోతే కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం అని కేంద్రాన్ని హెచ్చరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తోన్న మంచి పనులను చూసి ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది అని కేసీఆర్ ఆరోపించారు. ప్రజల చేత ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను తమ విధులు నిర్వర్తించకుండా కేంద్రం అడ్డుపడటం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అవుతుందన్న కేసీఆర్... ఎమర్జెన్సీ కంటే గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

Trending News