Samsung Galaxy S23 FE: శాంసంగ్ కస్టమర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ S23 FE ఒకటి. శాంసంగ్ గెలాక్సీ S21 FE కంటే అనేక అప్‌గ్రేడ్స్‌తో వస్తోన్న ఈ ఫోన్ వచ్చే నెల నుండి మార్కెట్లో విక్రయాలకు అందుబాటులోకి రానుంది. ఎక్సీనాస్ 2200 లేదా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 8 Gen 1 ఇంజన్ సహాయంతో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌కి 6.4-అంగుళాల FHD+ డిస్‌ప్లేను అమర్చినట్టు టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ చెబుతున్న వివరాలనుబట్టి తెలుస్తోంది.
ఫోన్ వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు 12-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 10 MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఉండే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ S23 FE బ్యాటరీ 4,500 mAh కాగా 25W ఫాస్ట్ చార్జర్ కలిగి ఉండనుంది. అంతేకాదండోయ్.. శాంసంగ్ గెలాక్సీ S23 FE వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫ్లాట్ బ్యాక్, 2.5D కర్వ్డ్ డిస్‌ప్లే డిజైన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర అమెరికాలో, ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 8 Gen 1 లేదా స్నాప్‌డ్రాగాన్ 8+ Gen 1 SoC ఉండనుండగా.. ఇతర ప్రాంతాలలో ఎక్సీనోస్ 2200 చిప్‌సెట్ అమర్చనున్నారు.
8GB LPDDR5 RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది. గతంలో దీనికంటే ముందుగా వచ్చిన మోడల్లో 32MP ఫ్రంట్ కెమెరా ఉండగా ఈ ఫోన్‌లో 10MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. మెగాపిక్సెల్ తగ్గినప్పటికీ.. లెన్స్‌ని మెరుగుపర్చి ఫోటోస్, వీడియోస్ క్వాలిటీ పెంచేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఏదేమైనా వచ్చె నెలలో శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫోన్ లాంచ్ అయితే కానీ ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటి, ఇందులో ఎలాంటి హార్డ్‌వేర్ ఉపయోగించారు అనే పూర్తి విషయాలు బయటికి వచ్చే అవకాశం లేదు. మొత్తానికి శాంసంగ్ ఫోన్ల కోసం వేచిచూస్తున్న వారికి శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫోన్ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్‌స్ట్రూమెంట్ కానుంది.