వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా జట్లతో జరగనున్న టీ 20 సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోని పేరు లేకపోవడం క్రికెట్ ప్రియులను ఆశ్యర్యానికి గురిచేసింది. ధోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ సెలెక్టర్లపై మాటలతోనే దాడి చేసినంత పనిచేశారు. అన్నింటికన్నా ముఖ్యంగా యంగ్ క్రికెటర్ రిశబ్ పంత్ పేరును పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు.. అనుభవజ్ఞుడైన ధోనిని ఎందుకు పక్కకుపెట్టారనే సందేహాలు ధోని ఫ్యాన్స్ బుర్రను తొలిచేశాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.
అయితే, తాజాగా గురువారం నాడు వెస్ట్ ఇండీస్ తో చివరి వన్డే ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో ఇదే విషయంపై కెప్టేన్ విరాట్ కోహ్లీ మొదటిసారిగా స్పందిస్తూ.. ఇప్పటికే ఈ విషయంపై సెలెక్టర్లు వివరణ ఇచ్చారని, మళ్లీ కొత్తగా తాను స్పందించడానికి ఏముంటుందని అన్నాడు. 21 ఏళ్ల యంగ్ క్రికెటర్ కి టీ20 ఫార్మాట్ లో తర్ఫీదు, అనుభవం పొందే అవకాశం ఇవ్వడానికే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని కోహ్లీ తన మనసులో మాటను చెప్పకనే చెప్పాడు. ఏదేమైనా ఈ విషయంలో జనం రకరకాలుగా అనుకోవడం సరికాదు. ఎందుకంటే ఇప్పటికీ ధోని టీమిండియా జట్టులో కీలక సభ్యుడే అని కోహ్లీ వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా ధోని సైతం రిశబ్ పంత్ లాంటి యంగ్ స్టర్స్ కి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడని, వన్డేల్లో ధోని ఎప్పుడూ కొనసాగుతాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ ఇచ్చిన ఈ వివరణ సైతం ధోని అభిమానులను అసంతృప్తికి గురిచేసింది. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన ధోని గురించి కోహ్లీ ఇలా అన్నాడేంటి అంటూ ధోని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.