England Vs South Africa: ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా విజయం.. గెలిచినా టోర్నీ నుంచి ఔట్

England Vs South Africa: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయినా సెమీస్​కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. టేబుల్​ టాపర్​గా నిలిచి సెమీస్​కు దూసుకెళ్లింది ఇంగ్లాండ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2021, 06:18 AM IST
    • ఇంగ్లాండ్ పై 10 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
    • గెలిచినా తక్కువ రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న సఫారీలు
    • మెరుగైన రన్ రేట్ తో సెమీస్ చేరిన ఆస్ట్రేలియా జట్టు
England Vs South Africa: ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా విజయం.. గెలిచినా టోర్నీ నుంచి ఔట్

England Vs South Africa: దురదృష్టమంటే దక్షిణాఫ్రికా జట్టుదే. టీ20 వరల్డ్ కప్ లో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు నెగ్గినా ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెమీస్‌ చేరాలంటే ఘనవిజయం సాధించాల్సిన తన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. డసెన్‌ (94 నాటౌట్‌), మార్‌క్రమ్‌ (52 నాటౌట్‌;) చెలరేగడం వల్ల మొదట దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ 8 వికెట్లకు 179 పరుగులే చేయగలిగింది. మొయిన్‌ అలీ (37) టాప్‌ స్కోరర్‌. షంసి (2/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. రబాడ (3/48) హ్యాట్రిక్‌ సాధించాడు. ప్రిటోరియస్‌ రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు.

సెమీస్‌ చేరాలంటే ఇంగ్లాండ్‌ను 131 లేదా అంత కంటే తక్కువకు కట్టడి చేయాల్సిన స్థితిలో దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దాడిని ఆరంభించింది. కానీ జేసన్‌ రాయ్‌ (20  రిటైర్డ్‌హర్ట్‌), బట్లర్‌ (26) ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలెట్టారు. 4 ఓవర్లలోనే స్కోరు 37. కానీ అయిదో ఓవర్లో రాయ్‌ రిటైర్డ్‌ హర్ట్‌ కావడం, జట్టు స్కోరు 59కు చేరుకునే సరికి బట్లర్‌, బెయిర్‌స్టో (1) ఔట్‌ కావడం వల్ల.. దక్షిణాఫ్రికా ఆశలు చిగురించాయి. గెలిచేందుకు అవకాశం దక్కినట్లనిపించింది. అయితే ఆ దశలో మొయిన్‌ అలీ కాస్త బ్యాట్‌ ఝుళిపించడం వల్ల సెమీస్‌ దారులు మూసుకుపోయాయి. మలన్‌ (33)తో మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించాక 13వ ఓవర్లో అలీ ఔటయ్యాడు.

15 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 125/3. విజయానికి ఇంగ్లాండ్‌ 30 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఛేదన క్లిష్టంగా మారింది. కానీ లివింగ్‌స్టోన్‌ (28) వరుసగా మూడు సిక్స్‌లు బాదడంతో 16వ ఓవర్లో (రబాడ) ఏకంగా 21 పరుగులొచ్చాయి. మలన్‌ ఔటైనా.. తర్వాతి ఓవర్లో 11 పరుగులొచ్చాయి. చివరి మూడు ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ఇంగ్లాండ్‌ అవకాశాలు మెరుగయ్యాయి. 19 ఓవర్లు ముగిసేసరికి లివింగ్‌స్టోన్‌ను కోల్పోయిన ఆ జట్టు 176/5తో నిలిచింది. మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. కానీ ఆఖరి ఓవర్‌ తొలి మొదటి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్‌ సాధించిన రబాడ... ఇంగ్లాండ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.

అంతకుముందు టాస్‌ ఓడిపోయిన బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఆరంభం నుంచే అదరగొట్టింది. డసెన్‌ అదిరే బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ సాఫీగా ఏమీ మొదలు కాలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్‌ హెండ్రిక్స్‌ (2) ఔటయ్యాడు. డికాక్‌కు డసెన్‌ తోడయ్యాడు. 5 ఓవర్లకు స్కోరు 26 పరుగులే. ఆ తర్వాత స్కోరు వేగం పెరిగింది. వోక్స్‌ బౌలింగ్‌లో డసెన్‌ వరుసగా 4, 6 దంచేశాడు. బ్యాట్స్‌మెన్‌ చక్కగా స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ, అప్పుడప్పుడు బౌండరీలు కొట్టడం వల్ల దక్షిణాఫ్రికా 11 ఓవర్లలో 85/1తో నిలిచింది. జోడీ జోరందుకునే దశలో డికాక్‌ (34)ను ఔట్‌ చేయడం ద్వారా 71 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని రషీద్‌ విడదీశాడు. కానీ మార్‌క్రమ్‌ రాకతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అతడు, డసెన్‌ పోటీపడుతూ ఫోర్లు, సిక్స్‌లు బాదేశారు. 13వ ఓవర్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న డసెన్‌.. వుడ్‌ వేసిన ఆ ఓవర్‌ చివరి బంతికి సిక్స్‌ కొట్టడంతో దక్షిణాఫ్రికా స్కోరు 100 దాటింది.

ఆదిల్ రషీద్‌ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌ సిక్స్‌ బాదేశాడు. డసెన్‌ వరుసగా రెండు సిక్స్‌లు, మార్‌క్రమ్‌ ఓ సిక్స్‌ కొట్టడంతో వోక్స్‌ ఓవర్లో 21 పరుగులొచ్చాయి. వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మార్‌క్రమ్‌.. అతడి తర్వాతి ఓవర్లో ఓ సిక్స్‌ దంచాడు. జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో డసెన్‌, మార్‌క్రమ్‌ చెరో సిక్స్‌ కొట్టారు. కేవలం 24 బంతుల్లో అర్ధశతకం సాధించిన మార్‌క్రమ్‌.. డసెన్‌తో అభేద్యమైన మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. చివరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 71 పరుగులు రాబట్టింది.  

Also Read: T20 World Cup 2021: వార్నర్ విశ్వరూపం..విండీస్ పై ఆసీస్ ఘన విజయం 

Also Read: Shoaib Akthar: 'అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కివీస్ ఓడిపోతే..చాలా ప్రశ్నలు తలెత్తుతాయ్'.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News