ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ : ఆఫ్ఘనిస్తాన్‌‌కు శిఖర్ ధావన్ సలహాలు, సూచనలు

ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు శిఖర్ ధావన్ సూచనలు 

Last Updated : Jun 16, 2018, 09:23 PM IST
ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ : ఆఫ్ఘనిస్తాన్‌‌కు శిఖర్ ధావన్ సలహాలు, సూచనలు

ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు తమ తొలి టెస్టు మ్యాచ్ తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, తమ ఆటను మరింత మెరుగు పర్చుకోవాలని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో బ్యాటింగ్ మెన్ శిఖర్ ధావన్ 96 బంతుల్లో 107 పరుగులు (4X19, 6X3), మురళీ విజయ్ 153 బంతుల్లో 105 పరుగులు (4X15, 6X1) రెచ్చిపోయి సెంచరీలు బాదగా.. బౌలింగ్‌ విభాగంలో అశ్విన్, జడేజా చెలరేగిపోయారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 262 పరుగుల భారీ తేడాతో భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఈ టెస్ట్ మ్యాచ్‌ అనంతరం శిఖర్ ధావన్‌ మాట్లాడుతూ '' క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టెస్ట్ మ్యాచ్ ఆడే హోదా దక్కించుకున్నందుకు ఆ జట్టుని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. అయితే, ఆ జట్టు మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి అంటే, తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది'' అని శిఖర్ ధావన్ అఫ్ఘనిస్తాన్ జట్టుకు సూచించాడు. 

ఆఫ్ఘనిస్తాన్ జట్టు గురించి మరింత మాట్లాడుతూ ''ఒక్కసారి ప్రత్యర్థి జట్టుపై విజయం సాధిస్తే చాలు.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఆత్మవిశ్వాసం దానంతట అదే వస్తుంది. ఇప్పటికే భారత జట్టుతో టెస్టు ఆడటం ఆ జట్టులో కచ్చితంగా ఉత్సాహం నింపే అంశం అవుతుంది'' అని చెప్పిన ధావన్ మ్యాచ్‌ని చూసేందుకు వచ్చిన అభిమానులకి ధన్యవాదాలు చెబుతూ ముగించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన శిఖర్ ధావన్.. టెస్ట్ మ్యాచ్‌లో లంచ్ సెషన్‌కి ముందు సెంచరీ చేసిన మొట్టమొదటి భారత ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Trending News