శిఖర్ ధావన్‌ని బలి పశువుని చేశారు : నిప్పులు చెరిగిన సునీల్ గవాస్కర్

Last Updated : Jan 13, 2018, 06:04 PM IST
శిఖర్ ధావన్‌ని బలి పశువుని చేశారు : నిప్పులు చెరిగిన సునీల్ గవాస్కర్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకి టీమిండియా జట్టు ఎంపిక విధానం సరైన పద్ధతిలో జరగలేదని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు ప్రముఖ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. 'ఈ మ్యాచ్ నుంచి శిఖర్ ధావన్‌ని పక్కన పెట్టి అతడిని ఓ బలి పశువుని చేశారు' అని జట్టుని ఎంపిక చేసిన మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఫస్ట్ టెస్ట్ ఓటమి తర్వాత రెండో టెస్టు విజయాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టులో పలు మార్పులుచేర్పులకి పూనుకున్న సెలక్షన్ కమిటీ.. రెండో టెస్టుకి భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహను పక్కనపెట్టి వారి స్థానంలో జట్టులోకి ఇశాంత్ శర్మ, కేఎల్ రాహుల్, పార్థివ్ పటేల్‌లని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

అయితే, సాహ తొలగింపుని అంతగా పట్టించుకోని సునీల్ గవాస్కర్.. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌లని జట్టులోంచి పక్కనపెట్టడంపై మాత్రం నిప్పులు చెరిగారు. ఓపెనింగ్ రోజు లంచ్ సమయానికి సౌతాఫ్రికా జట్టు 78/0 స్కోర్ చేయడం, టీమిండియా బౌలర్లు ఎవ్వరూ సరైన స్థాయిలో బౌలింగ్ చేయకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన సునీల్ గవాస్కర్.. లంచ్ సెషన్ తర్వాత సోనీ టెన్1 తో మాట్లాడుతూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. "శిఖర్ ధావన్ ని ఈ మ్యాచ్ నుంచి పక్కకు పెట్టి అతడిని బలి పశువుని చేశారు. ఈ జట్టు నుంచి ఎవ్వరినీ తొలగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతగా ఇశాంత్ ని జట్టులోకి తీసుకోవాలని మేనేజ్ మెంట్ భావిస్తే, మొహమ్మద్ షమీని కానీ లేదా జస్ప్రిత్ బుమ్రాను కానీ పక్కకు పెట్టాల్సి వుండాల్సింది. కానీ అలా కాకుండా భువనేశ్వర్ కుమార్ ని పక్కకు పెట్టడంలో అసలు అర్ధమే లేదు" అని అన్నారు. కేవలం ఒక్క మ్యాచ్‌లో ఫలితం బాగోలేదని అంత భారీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. 

Trending News