కోల్‌కతాను ఓడించి ఆశలు సజీవం చేసుకున్న ముంబై ఇండియన్స్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Last Updated : May 6, 2018, 09:23 PM IST
కోల్‌కతాను ఓడించి ఆశలు సజీవం చేసుకున్న ముంబై ఇండియన్స్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ విధించిన  182 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చతికిలపడ్డారు. దీంతో బ్యాటింగ్‌లో తమ సత్తా చాటుకున్న ముంబై ఇండియన్స్‌.. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా రాణించడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. దీంతో కోల్‌కతా ఖాతాలో ఐదో ఓటమి వచ్చి చేరగా ముంబై ఇండియన్స్ నాలుగవ విజయాన్ని నమోదు చేసుకుంది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌ ఓపెనర్లు క్రిస్‌ లిన్‌(17), శుభ్‌మాన్‌ గిల్‌(7) తడబడగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్‌ ఉతప్ప(54), నితీష్‌ రాణా(31), దినేశ్‌ కార్తీక్‌(36 నాటౌట్‌)లు తమ వంతు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు తీసుకోగా, కృనాల్‌ పాండ్యా, బూమ్రా, మెక్లాన్‌గన్‌, మార్కండే చెరో వికెట్‌ పడగొట్టారు.

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్: ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 59 పరుగులు(39బంతుల్లో 4X7, 6X2 ), ఎవిన్‌ లూయిస్ 43 పరుగులు (23 బంతుల్లో 4X5, 6X2)లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టేన్ రోహిత్ శర్మ కేవలం 11 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యాతో కలిసి సూర్యకుమార్‌ స్కోరు బోర్డుని పరిగెత్తించే ప్రయత్నం చేస్తుండగానే అతడిని రస్సెల్‌ ఔట్‌ చేశాడు. అనంతరం కృనాల్‌ పాండ్యా సైతం 14 పరుగులకే వికెట్ కోల్పోయాడు. ఇన్నింగ్స్ చివర్లో హార్దిక్‌ పాండ్యా రాబట్టిన 35 పరుగులు ( 20 బంతుల్లో 4X4, 6X1) నాటౌట్, డుమినీ (నాటౌట్) చేసిన 13 పరుగుల కారణంగా ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డు 181కి చేరింది. 

Trending News