రెండు సార్లు ఓటమిపాలైన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి ఈ మ్యాచ్ కాస్త ఊరటను ఇచ్చిందని చెప్పుకోవచ్చు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ప్రత్యర్థి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ పై విజయ ఢంకా మ్రోగించింది. రాయల్ ఛాలెంజర్స్ ఇచ్చిన 176 పరుగుల టార్గెట్‌ని 19.1 ఓవర్లలో చేరి ఊపిరి పీల్చుకుంది. మొదటి నుంచీ కాస్త తడబడుతునే ఆడినా.. కోల్‌కతా ఆటగాళ్లలో మెజారిటీ ఆటగాళ్లు తక్కువ స్కోరుకే అవుటైనా.. క్రిస్‌లిన్ రంగంలోకి దిగాక కాస్త స్కోరు బోర్డు పరుగెత్తడం ప్రారంభించింది.
52 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన క్రిస్ లిన్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన రాబిన్ ఉతప్ప (36 పరుగులు), సునీల్ నరైన్ (27 పరుగులు) కూడా ఆయనకు దీటుగా సహకారం ఇవ్వడంతో జట్టు విజయాన్ని నమోదు చేయగలిగింది
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే అర్థ సెంచరీ (44 బంతుల్లో 68 పరుగులు) చేసి కాస్త మెరుగనిపించాడు. ఆ తర్వాత వచ్చిన బ్రెండన్ మెక్‌కల్లమ్(38) కాసేపు మెరుపులు కురిపించాడు. ఆ తర్వాత అందరూ వరుసగా అవుట్ అవ్వడంతో జట్టు తక్కువ స్కోరుని నమోదు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బెంగుళూరు జట్టు బౌలింగ్ కూడా పేలవంగా ఉండడంతో గేమ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి అనుకూలంగా మారడం ప్రారంభించింది. ఫలితంగా అదే జట్టు విజయభేరి మ్రోగించింది.
ఛాలెంజర్స్ పై కోల్‌కతా విజయభేరి..!