ఏడేళ్లపాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి గేల్ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఆ జట్టు తరఫున అతనెలా ఆడాడో, ఎన్ని విజయాలను అందించాడో తెలిసిందే..! తాజాగా ఆర్‌సీబీ వ్యవహారశైలిపై క్రిస్‌గేల్ విమర్శలు గుప్పించాడు.
పదకొండో ఐపీఎల్ సీజన్ కోసం నిర్వహించిన వేలానికి ముందు తనను బెంగళూరు ఫ్రాంఛైజీ తిరిగి అట్టిపెట్టుకుంటామని మాటిచ్చి మొహం చాటేసిందని క్రిస్ గేల్ పేర్కొన్నాడు. వాళ్ల నిర్ణయంతో తాను చాలా నిరాశకు గురయ్యానని చెప్పారు. 'నాకు ఫోన్ చేసి నన్ను తిరిగి జట్టులోకి తీసుకోవాలనుకుంటున్నట్లు మొదట చెప్పారు. ఆ తరువాత మళ్లీ ఫోన్ వస్తే ఒట్టు. నేను వాళ్లకు అవసరంలేదనే అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. అదంతా ఓకే. నేనెవరితోనూ గొడవపడను' అని గేల్ చెప్పాడు.
సీపీఎల్, బీపీఎల్‌లో అద్భుతంగా రాణించానని.. ఐపీఎల్ వేలంలో తనను ఎవరూ కొనుగోలు చేయకపోవడంపై ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఐతే ప్రస్తుతం పంజాబ్ తరఫున ఆడటాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. నేను కింగ్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడాలని రాసి పెట్టి ఉందని గేల్ వ్యాఖ్యానించాడు.