ఐపీఎల్ 2018లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 181 రన్స్ చేసింది.
182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే (19వ ఓవర్లలో) ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై బెంగళూరు విజయం సాధించి.. ఈ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోగా.. ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. డివిలియర్స్ చివరి దాకా పోరాడి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. ఏబీ డివిలియర్స్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో 72 నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 70 రన్స్ చేయడంతో బెంగళూరు 19 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 187 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు సాధించగా, హర్షల్ పటేల్, లామించే, మిశ్రా ఒక్కో వికెట్ తీశారు.