విరాట్ కోహ్లీ ముందు భారీ సవాల్.. కూల్‌గా టీమ్‌తో డిన్నర్ ఎంజాయ్ చేసిన కెప్టేన్

రాయల్ ఛాలెంజర్స్‌కి బిగ్ ఛాలెంజ్ రేపే

Last Updated : May 12, 2018, 12:51 AM IST
విరాట్ కోహ్లీ ముందు భారీ సవాల్.. కూల్‌గా టీమ్‌తో డిన్నర్ ఎంజాయ్ చేసిన కెప్టేన్

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆడిన 10 మ్యాచ్‌లో కేవలం మూడింటిలోనే విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ప్లే ఆఫ్‌లోకి అర్హత సాధించాలంటే ఇకపై ఆడనున్న నాలుగు ఆటల్లోనూ విజయం సాధించాల్సిందే. అందులో మొదటి మ్యాచ్ రేపు శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌పైనే. ఇప్పటికే గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే, ఢిల్లీతో జరగనున్న పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు గెలవకపోతే, ఇక ఆ జట్టు పరిస్థితి కూడా ఇంచుమించు ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోకతప్పదు. ఇప్పటికే గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన తర్వాత ఆ జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీలో మునుపటి జోష్ కనిపించడం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 147 లాంటి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో తమ జట్టు బ్యాట్స్‌మెన్ మొత్తం కలిపి 9 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులే చేయడం వంటి పరిణామాలు విరాట్ కోహ్లీకి నోట మాట రాకుండా చేశాయి. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో 396 పరుగులతో ఈ సీజన్ లీడ్ స్కోరర్‌గా కొనసాగుతున్న కోహ్లీకి ఈ సీజన్ నిజంగానే పెను సవాల్‌గా మారింది. బౌలింగ్ విభాగం పర్‌ఫార్మెన్స్‌ల విషయానికొస్తే, ఆల్ రౌండర్‌గా పేరున్న వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్‌లో పెద్దగా ఆడిందేమీ లేదు. బౌలింగ్‌లో అన్ని మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్న సుందర్ జట్టుని, అభిమానులని తీవ్రంగా నిరాశపరిచాడు. పేసర్లు టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌లు అక్కడక్కడా మెరిశారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేదేం లేదనుకున్నాడో ఏమో కానీ జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీ సైతం రిలాక్సింగ్‌గా కనిపిస్తున్నాడు. శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ జట్టుతో తలపడి గెలవాల్సి వుండగా అంతకన్నా ముందుగా కోహ్లీ తన టీమ్‌మేట్స్‌ని తన సొంత సిటీలో కూల్‌గా డిన్నర్‌కి తీసుకెళ్లడాన్ని సైతం కొంతమంది ఆసక్తికరమైన అంశంగా చర్చించుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ ఫ్యాన్స్, కోహ్లీ ఫ్యాన్స్ దృష్టి అంతా శనివారం జరగనున్న మ్యాచ్‌పైనే ఫోకస్ అయి వుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయినా ఆ జట్టు కొత్తగా నష్టపోయేదేం లేదు కానీ బెంగుళూరుకు మాత్రం గెలిచితీరాల్సిన అవసరం వుంది. ఏం జరుగుతుందో తెలియాలంటే రేపు మ్యాచ్ ఫలితం తేలేవరకు వేచిచూడాల్సిందే మరి.   

Trending News