స్టేడియంలో జడేజావైపు బూట్లు విసిరిన కావేరి నిరసనకారులు

మొత్తానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా కావేరీ నిరసనకారులను మాత్రం అడ్డుకోలేకపోయారు.

Last Updated : Apr 15, 2018, 05:12 PM IST
స్టేడియంలో జడేజావైపు బూట్లు విసిరిన కావేరి నిరసనకారులు

అందరూ అనుకున్నట్టుగానే చెన్నైలో నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కి కావేరి సెగ తగిలింది. కావేరి నదీ జలాల బోర్డు ఏర్పాటు కోసం ఆందోళనలు జరుగుతున్న సమయంలో చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించరాదంటూ ఆందోళనకారులు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.! చేపాక్‌ స్టేడియంలో మ్యాచ్ నిర్వహిస్తే.. మైదానంలో పాములు వదులుతామని టీవీకే నేత వేల్‌మురుగన్ మ్యాచ్‌కు ముందే హెచ్చరించారు. అయితే షెడ్యుల్‌లో అనుకున్న ప్రకారం.. అనుకున్నట్టు మ్యాచ్ జరిపి తీరుతామని ఐపీఎల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఆ మేరకే మంగళవారం  చేపాక్ స్టేడియంలో నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

మ్యాచ్ ప్రశాంతంగా జరగడానికి నాలుగువేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను కూడా స్టేడియంలోకి అనుమతించలేదు. అలానే హెల్మెట్స్‌, కెమెరాలు, గొడుగులు, బయటి ఫుడ్‌, మైదానంలోకి విసరడానికి అనువుగా ఉండే ఏ వస్తువును అనుమతించలేదు పోలీసులు.

నామ్ తమిళియర్ కచ్చి కార్యకర్తలు ఆటకు అంతరాయం కలిగించాలని చూశారు. ఈ క్రమంలో చెన్నై, కోల్‌కతా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఆందోళనకారులు బూట్లు విసిరారు. ఆ సమయంలో మైదానంలో జడేజా ఫిల్డింగ్ చేస్తున్నాడు. ఐతే అవి బౌండరీ లైన్ వద్ద పడ్డాయి. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న రవీంద్ర జడ్డేజా.. మ్యాచ్‌ ఆడని డుప్లెసిస్‌ మైదానంలో పడిన బూట్లను బయటకు విసిరేశారు. దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 21 మంది నామ్ తమిళియర్ కచ్చి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మొత్తానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా కావేరీ నిరసనకారులను మాత్రం అడ్డుకోలేకపోయారు.

Trending News