దక్షిణాఫ్రికాలో ఐసీసీ మహిళా ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆతిథ్య దేశంలో పర్యటిస్తున్న భారత మహిళా జట్టు నేడు సిరీస్‌లో చివరి వన్డేను ఆడుతోంది.. తొలి రెండు వన్డే మ్యాచ్‌లలో గెలిచి జోరుమీదున్న టీమిండియా మహిళా జట్టు, మూడో వన్డేలో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. సఫారీల మహిళా జట్టు కూడా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. టీమిండియా మహిళా క్రికెట్ జట్టు తొలి, రెండు వన్డేలలో 124, 125 పరుగులకే సఫారీలను ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే..!!
పోచెఫ్ స్ట్రోమ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాంలో ఉన్న మందాన డకౌట్ అయి వెనుదిరగగా, మిథాలీ రాజ్ 4 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. ఆ తరువాత బరిలోకి దిగిన వేదా కృష్ణమూర్తి, డీబీ శర్మలు పరుగులతో ఆదుకున్నారు. వేదా కృష్ణమూర్తి 58 బంతుల్లో 7 ఫోర్లు కొట్టి అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. ఉమెన్ దీప్తి కూడా 92 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. కడపటి వార్తలందేసరికి భారత మహిళా జట్టు 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.