జకర్తా : 2018 ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట ప్రారంభమైంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో భారత షూటర్లు అపూర్వి చండేలా, రవికుమార్ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడంతో తొలి రోజునే భారత శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ జంట షూటర్లు 429.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలవగా... ప్రథమ, ద్వితీయ స్థానాలను చైనీస్ తైపీ (494.1 పాయింట్లు), చైనా (492.5) దేశాలు కైవసం చేసుకున్నాయి. అయితే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో భారత షూటర్లు మను బాకర్, అభిషేక్ వర్మ ఎలాంటి పతకాలు గెలవకపోవడం గమనార్హం.
ఈ జంట 759 పాయింట్లతో ఆరో స్థానంతోనే సరిపెట్టుకొని.. ఫైనల్ పోటీలకు అర్హతను సంపాదించుకోవడంలో విఫలమైంది. ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన తొలి పతకాన్ని చండేలా, రవి కుమార్‌లు తీసుకురావడం విశేషం. జకాబేరింగ్ ఇంటర్నేషనల్ షూటింగ్ రేంజ్లో ప్రారంభమైన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగం పోటీలలో మంగోలియా, ఇరాన్, ఇండోనేషియా, నేపాల్, ఉత్తర కొరియా, వియత్నాం, యూఏఈ, జపాన్, పాకిస్తాన్ మొదలైన దేశాలు కూడా పాల్గొన్నాయి.
ఈ సారి షూటింగ్ విభాగంలో భారత్ నుండి 28 క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ సారి భారత క్రీడాకారుల్లో అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 50 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా.. డైవింగ్, కనోయింగ్, కరాటే పోటీల్లో అతి తక్కువగా ఇద్దరేసి క్రీడాకారులను మాత్రమే భారత్ పంపించింది. ఆసియా క్రీడల్లో 18వ సారి భారత్ పాల్గొనడం విశేషం.