IND vs SL 2nd T20 Highlights: మొదటి మ్యాచ్ గెలిచి ఊపుమీదున్న టీమిండియాకు శ్రీలంక షాకిచ్చింది. రెండో టీ20లో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 206 పరుగులు చేయగా.. అనంతరం టీమిండియా 8 వికెట్లకు 190 రన్స్ చేసింది. భారత్ తరఫున అక్షర్ పటేల్ సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినా భారత్‌కు ఓటమి తప్పలేదు.
టాస్ గెలిచిన టీమిండియా ముందుగా శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. శ్రీలంక తరఫున కెప్టెన్ దసున్ శనక 22 బంతుల్లో 56 (2 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కుశాల్ మెండిస్ 31 బంతుల్లో 52, నిసంక 33, అసలంక 37 పరుగులు చేయడంతో శ్రీలంక భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా చివర్లో శనక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి ఆరు ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 83 పరుగులు పిండుకోవడం విశేషం.
గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత బౌలింగ్ దళం ఈసారి పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండు ఓవర్లలోనే ఐదు నోబాల్స్ వేసి చెత్త రికార్డు ముటగట్టుకున్నారు. శివమ్ మావీ కూడా ఈ మ్యాచ్‌లో ప్రభావం చూపించలేకపోయాడు. నాలుగు ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ 48 పరుగులు ఇచ్చినా.. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 2, చాహల్ ఒక వికెట్ తీయగా.. ఇద్దరు పొదుపుగా బౌలింగ్ చేశారు.
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను పేసర్ రజిత దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (2), శుభమాన్ గిల్ (5)ను ఔట్ చేసి శ్రీలంక విజయానికి పునాది వేశాడు. తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతున్న రాహుల్ త్రిపాఠి (5) వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (12), దీపక్ హుడా (9) కూడా వెంటవెంటనే ఔట్ అవ్వడంతో 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియాకు ఘోర పరాజయం తప్పదని అనుకున్నారు. స్కోరు బోర్డు కనీసం వందైనా దాటుతుందా అనే అనుమానం వచ్చింది.
అయితే ఇక్కడి నుంచే భారత్ గేర్ మార్చింది. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశారు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో ఎడపెడా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆ తరువాత టాప్ గేర్‌లోకి వచ్చాడు.
దీంతో టీమిండియా విజయానికి 29 బంతుల్లో 61 పరుగులు అవసరం అయ్యాయి. గెలుపుపై భారత అభిమానుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఇక్కడే భారత్‌కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. మదుశంక బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన సూర్యకుమార్ లాంగాన్ వద్ద ఫీల్డర్‌కు దొరికిపోయాడు. ఈ ఒక్క షాట్‌తో భారత్ ఓటమి ఖరారు అయిపోయింది. అయితే శివమ్ మావి (15 బంతుల్లో 26) 2 ఫోర్లు, 2 సిక్సర్లతో బాది మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు చేయాల్సి ఉండగా.. రజిత 19 ఓవర్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 21 రన్స్ అవసరం అవ్వగా.. కెప్టెన్ శానక నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో 16 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. శానకకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: Arshdeep Singh Trolled: అర్షదీప్ సింగ్‌ని దారుణంగా ఏడిపించిన ట్రోలర్స్.. ఎందుకంటే..
Also Read: AP High Court : సలహాదారుల రాజ్యాంగబద్దత తేలుస్తాం..ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook