ఫుట్‌బాల్‌ను ఒక వరల్డ్ కప్ స్థాయిలో ఆడడం భారత్‌కు తీరని కోరికేనా.. అంటే ఒకసారి ఎవరైనా ఆలోచించాల్సి వస్తుంది. అలాగని భారత్‌లో ఫుట్‌బాల్ అభిమానులు లేరని కాదు.. చాలామంది ఉన్నారు.. ఒక పశ్చిమ బెంగాల్‌లోనే చూసుకుంటే మోహన్ బగాన్ లాంటి క్లబ్బులు ఫుట్‌బాల్ అంటే ప్రాణం ఇస్తాయి. క్రికెటర్ సౌరభ్ గంగూలీకి కూడా ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. అతను ఒకప్పుడు ఫుట్‌బాల్ ఆటగాడు కూడా. ఫుట్‌బాల్ విషయంలో మనకంటూ ఒక ఘన చరిత్ర ఉంది. 1951, 1962 ఆసియన్ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు స్వర్ణం గెలుచుకుంది. కానీ ఆ తర్వాతే పరిస్థితి మారింది. 1950లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కి భారత్ క్వాలిఫై అయినప్పటికీ పలు రాజకీయ కారణాల వలన టోర్నిలో పాల్గొనకుండానే వైదొలగాల్సి వచ్చింది. ఆసియన్ గేమ్స్‌లో పాల్గొన్నప్పుడు మాత్రం అప్పటి కోచ్ సయ్యద్ అబ్దుల్ సలీం శిక్షణలో మన టీమ్ గొప్ప విజయాలనే అందుకున్నా.. అదే దూకుడు తర్వాత రోజుల్లో కనబరచలేదు. ఆ తర్వాత ఆసియన్ గేమ్స్‌లో కూడా కేవలం రెండు సార్లు మాత్రమే క్వాలిఫై అయ్యింది. 1984, 2011లో మాత్రమే ఎంపిక అయ్యింది. అయితే 2011లో తొలి రౌండులోనే టీమ్ అపజయాన్ని మూటగట్టుకొని వెనుదిరగాల్సి వచ్చింది. భారత్ ఫుట్‌బాల్‌లో వెనుకబడడానికి చాలా మంది విశ్లేషకులు చాలా కారణాలు చెబుతూ ఉంటారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన శిక్షణ పద్ధతులు లేకపోవడం ఒక ఎత్తైతే.. ఈ ఆట మీద ఆసక్తి కనబరిచే సిసలైన టాలెంటును పసిగట్టడం లాంటి విషయాల్లో సెలక్షన్ కమిటీలు చూపించే ఉదాసీనత.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఒక ఒలింపిక్స్‌లో చూసుకున్నా.. మనది ఎప్పుడూ ఎంపికవ్వని రికార్డే.
అయినా గొప్ప టాలెంటెడ్ ఆటగాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు. బైచింగ్ భుటియా లాంటి ఆటగాళ్ళు కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమ్ పరిస్థితి ఉన్నంతలో కాస్త మెరుగ్గా ఉండేది. అతని ఆధ్వర్యంలోనే తొలిసారిగా 2008లో మన టీమ్ ఎఎఫ్‌సీ ఛాలెంజ్ కప్ గెలిచి, ఎంతో కొంత మనకీ సత్తా ఉందని నిరూపించింది. ఫుట్‌బాల్ క్రీడలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆసియా దేశాల కోసం నిర్వహించే ఈ టోర్నిలో భారత్‌తో మరికొన్ని దేశాలు ఎప్పటికప్పుడు లక్‌ను పరీక్షించుకుంటున్నాయి. అయినా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అనేది అందని ద్రాక్షే. స్వదేశీ నెహ్రు కప్‌లో గెలవడం, సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ కప్‌లో తమ కన్నా తక్కువ ర్యాంకింగ్ గల దేశాలపై గెలవడం ఒక తెలియని సంతోషాన్ని ఇచ్చినా.. ఫ్రెండ్ షిప్ మ్యాచుల్లో గెలిచి ఆనందాన్ని పొందినా.. అంతర్జాతీయ స్థాయిలో ఎలా మెరుగ్గా రాణించి అందలం ఎక్కాలన్న కోరిక భారత్‌కు తీరేనా అన్నది ప్రశ్న. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 107 వ స్థానంలో ఉంది. గత కొద్ది సంవత్సరాల ర్యాంకింగ్స్‌తో పోల్చుకుంటే ఈ ర్యాంకింగ్ కొంతవరకూ మెరుగే. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛత్రీ కూడా తనకున్న పరిమితుల మేరకు జట్టుకు బాగానే సహకారం ఇస్తున్నాడు. అయినా ఎప్పుడు భారత్ మరిన్ని విజయాలు కైవసం చేసుకుంటుంది.. కనీసం క్వాలిఫ్ అయ్యి ఒక్క వరల్డ్ కప్ అయినా ఆడుతుంది.. లాంటి వన్నీ ప్రశ్నలే..
యువోత్సాహం.. దొరికిన అదృష్టం
ఇటీవలే అండర్ 17 ఫిఫా వరల్డ్ కప్ భారత్‌లో నిర్వహించే హక్కులు మన దేశానికి కట్టబెట్టినప్పుడు మళ్లీ ఓ చిరుఆశ అందరి మదిలో ఏర్పడింది. కనీసం కుర్రాళ్లు ఆడుతున్న ఆట అయినా.. ఆతిథ్య జట్టుగా భారత్ నేరుగా ప్రపంచ కప్‌లో తొలిసారిగా ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. ఇదో వింత.. విచిత్రం.. అయినా ఫరవాలేదు.. మనమూ అతి గొప్ప అంతర్జాతీయ పోటీకి మన కుర్రాళ్ళనూ పంపుతున్నాం. ఇప్పటికే క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ యువ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ కూడా చేశారు. మన ఫుట్ బాల్ సమాఖ్య కూడా మన టీమ్‌ను పంపుతున్నాం కాబట్టి ఎక్కడా రాజీ పడలేదు. అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం కోసం కుర్రాళ్ళను విదేశాలకు పంపింది. రెండేళ్ళ నుండే ఇదే పని మీద కసరత్తు చేస్తూ, మన కుర్రాళ్లూ వివిధ పోటీల్లో పాల్గొన్నారు. 2015లో అయిదు దేశాల్లో 31 మ్యాచ్‌లు ఆడి 18 విజయాలు దక్కించుకున్నారు. 2016లో 28 మ్యాచ్‌లు ఆడి 15 గెలిచారు. ఇదంతా ఒక అనుభవం కోసమే. సాధారణంగా మన కుర్రాళ్ళ టూర్స్ అన్నీ కూడా యూరోపియన్ దేశాలలోనే జరిగాయి. ఇప్పుడు వరల్డ్ కప్‌లో పాల్గొన్నాక, వీరి ప్రదర్శన ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పక్కన పెడితే.. గెలుపు ఓటములను కూడా పక్కన పెడితే.. వారు ఆశాజనకంగానే రాణిస్తారని ఆశిద్దాం.. ఆల్ ది బెస్ట్ టు యంగ్ బడ్డీస్.. !
Indian National Senior Team wishes our U-17 Team all the best before #FIFAU17WC kicks off. All the best boys. Jai Hind. #BackTheBlue pic.twitter.com/U4uQNxx8O7
— Indian Football Team (@IndianFootball) October 4, 2017