భారత్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ సందడి షురూ !

Last Updated : Oct 6, 2017, 06:17 PM IST
భారత్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ సందడి షురూ !

భారత క్రీడారంగం మరో చారిత్రాత్మక అధ్యయనానికి మరికొద్ది క్షణాల్లో నాంది పలకనుంది. అంతర్జాతీయంగా ఇప్పటివరకు భారత స్టేడియాలు క్రికెట్ కు మాత్రమే వేదికయ్యాయి. కానీ, మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) ఈవెంట్లకు వేదికకానున్నాయి. ప్రతిష్టాత్మక అండర్-17 ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలు భారతదేశంలో జరుగుతున్న విషయం అందరికీ విదితమే.  

అక్టోబర్ 6, 2017 నుండి ప్రారంభంకానున్న ఫిఫా టోర్నీలు అక్టోబర్ 28, 2017 వరకు జరగనున్నాయి. 23 రోజులపాటు సాగే టోర్నీని ప్రపంచవ్యాప్తంగా 20కోట్ల మందిపైగా వీక్షిస్తారని అంచనా. ఫిఫా అండర్-17 ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నీలు ఆరు వేదికల్లో 52 మ్యాచులు జరగనున్నాయి. నేడు జరిగే ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీలో ఆతిథ్య దేశంగా భారత్ తొలిసారి అమెరికాతో ఢీ కొట్టనుంది. ఈ ఘట్టానికి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికకానుంది. 

టోర్నీ అట్టహాసంగా ప్రారంభించాలని భారతదేశం తొలుత భావించినప్పటికీ, ఫిఫా అందుకు అంగీకరించలేదు. దాంతో వేడుకలు మామూలుగానే ఆరంభిస్తున్నారు. కానీ భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తొలి మ్యాచ్ కు ముందు చిన్న ఆరంభవేడుక నిర్వహించనుంది. ఢిల్లీలో సాయంత్రం 5 గంటలకు జరిగే తొలి మ్యాచ్ ను చూసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తారని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షులు ప్రఫుల్ పటేల్ తెలిపారు. 

ఫిఫా ప్రపంచకప్ వేదికలు : ఢిల్లీ, నవీ ముంబై, కొచ్చి, గోవా, గౌహతి, కోల్కతా 

గ్రూప్ 'ఎ' టీం: ఇండియా, యుఎస్ఏ, కొలంబియా ఘనా
గ్రూప్ 'బి' టీం: పరాగ్వే, మాలి, న్యూజిలాండ్, టర్కీ 
గ్రూప్ 'సి టీం: ఇరాన్, గినీ, జర్మనీ, కోస్టారికా
గ్రూప్ డి టీం: కొరియా డిపిఆర్, నైజర్, బ్రెజిల్, స్పెయిన్ 
 గ్రూప్ ఇ టీం: హోండురాస్, జపాన్, న్యూ కాలెడోనియా, ఫ్రాన్స్ 
గ్రూప్ ఎఫ్ టీం : ఇరాక్, మేక్సికో, చిలీ, ఇంగ్లాండ్  

టికెట్టు ధరలు : రూ. 40- రూ. 800 (ఫేస్ ప్రకారం టికెట్ ధరలు) 

 టైమింగ్స్ : సాయంత్రం 5 గంటలకు, రాత్రి 8 గంటలకు 

Trending News