వన్డే క్రికెట్‌లో ఇటీవలే భారత యువ క్రికెటర్ రోహిత్ శర్మ తన మూడవ డబుల్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఈయన 208 పరుగులు చేసి మళ్ళీ మరో క్రికెట్ రికార్డును తిరగ రాశారు. ఈ క్రమంలో వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఇతర క్రికెట్ హీరోల గురించి కూడా ఓసారి అవలోకనం చేసుకుందాం..!
రోహిత్ శర్మ : వన్డే క్రికెట్‌లో మూడుసార్లు డబుల్ సెంచరీ నమోదు చేసిన వ్యక్తిగా భారత క్రికెటర్ రోహిత్ శర్మను చెప్పుకోవచ్చు. 2013లో తొలిసారిగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 209 పరుగులు చేశాడు రోహిత్.
ఆ తర్వాత 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేసి తన రెండవ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఇటీవలే డిసెంబరు 13, 2017 తేదీన శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 208 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచిన రోహిత్ తన కెరీర్‌లో మూడవ డబుల్ సెంచరీ చేశాడు.
సచిన్ టెండుల్కర్ : వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా మరియు తొలి భారతీయ క్రికెటర్‌గా కూడా సచిన్ టెండుల్కర్‌ను చెప్పుకోవచ్చు. 2010లో గ్వాలియర్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 200 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచి తను ఆ ఘనతను సాధించాడు.
వీరేంద్ర సెహ్వాగ్: వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండవ భారతీయ క్రికెటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను చెప్పుకోవచ్చు. 2011లో వెస్టిండీస్‌తో ఇండోర్‌లో జరిగిన వన్డేలో 219 పరుగులు చేసి సెహ్వాగ్ ఆ ఘనతను సాధించాడు
క్రిస్ గేల్ : 2015లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 215 పరుగులు చేసిన క్రిస్ గేల్, వరల్డ్ కప్ సిరీస్‌లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు
మార్టిన్ గుప్తిల్: వన్డేల్లో అత్యధిక స్కోరుగా 264 పరుగులు చేసిన రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ ఉండడం విశేషం. 2015లో వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ ఘనతను సాధించాడు మార్టిన్ గుప్తిల్