Vinesh Phogat: పతక పోరులో వినేశ్‌ ఫొగాట్‌కు పరాభవం.. మెడల్‌పై కోర్టు సంచలన తీర్పు

Vinesh Phogat Petition CAS Dismissed: భారతదేశానికి ఒలింపిక్స్‌ పతకం తీసుకురావాలనే వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరింది. ఆమెకు రావాల్సిన మెడల్‌పై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 15, 2024, 12:44 AM IST
Vinesh Phogat: పతక పోరులో వినేశ్‌ ఫొగాట్‌కు పరాభవం.. మెడల్‌పై కోర్టు సంచలన తీర్పు

Vinesh Phogat: అద్భుతమైన ప్రదర్శనతో పారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అనూహ్యంగా పోటీ మధ్యలో నుంచి వైదొలిగింది. అధిక బరువు కారణంగా అనర్హత వేటుతో ఫైనల్‌లో తలపడే అవకాశాన్ని కోల్పోవడంతో యావత్‌ ప్రపంచం విస్మయం వ్యక్తం చేసింది. అయితే ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ తీసుకున్న సస్పెన్షన్‌ నిర్ణయంపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)లో సవాల్‌ చేయగా.. ఆ కోర్టు కూడా ప్రతికూల తీర్పునిచ్చింది. వినేశ్‌ ఫొగట్‌ చేసిన సవాల్‌ను కొట్టిపారేసింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. కాస్‌ అప్పీల్‌ను తిరస్కరించడంతో వినేశ్‌ ఫొగట్‌ ఎలాంటి పతకం లేకుండానే స్వదేశం చేరుకుంది. కోర్టు తీర్పుతో భారత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Also Read: Saina Nehwal: నాతో ఆడితే జస్ప్రీత్‌ బుమ్రా కుప్పకూలుతాడు: సైనా నెహ్వాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

 

'యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) విధించిన అనర్హత వేటుపై వినేశ్‌ ఫొగట్‌ చేసిన సవాల్‌ను కాస్‌ తిరస్కరించడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ తీర్పు తీవ్ర నిరాశను నింపింది. రజత పతకం ఇవ్వాలని వినేశ్‌ చేసిన విజ్ఞప్తిని కాస్‌ కోర్టు ఆగస్టు 14వ తేదీన తీర్పు ఇచ్చింది' అని భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు. ఎన్నో ఆశలతో పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లిన వినేశ్‌ తన శక్తికి మించి బౌట్‌లో పోరాడినా ఫలితం నిరాశకు గురి చేసింది. ఆఖరి మెట్టులో కూడా ఆమెకు ప్రతికూల ఫలితం రావడంతో వినేశ్‌ ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది.

Also Read: Arshad Nadeem: గోల్డెన్‌ బాయ్‌ ఒక మేస్త్రీ కొడుకు.. చందాలతో ఒలింపిక్స్‌లో చరిత్రను తిరగరాశాడు

 

పారిస్‌ ఒలింపిక్స్‌లో వినేశ్‌ రెజ్లింగ్‌ ఫ్రీ స్టైల్‌ 50 కిలోల మహిళల విభాగంలో తలపడిన విషయం తెలిసిందే. ఫైనల్‌ వరకు దూసుకుంటూ వచ్చిన వినేశ్‌ ఫొగట్‌ అత్యద్భుత ప్రదర్శన కనబర్చింది. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పతకం కోసం తీవ్రంగా శ్రమించింది. కానీ వంద గ్రాములు అదనంగా బరువు ఉన్నారనే కారణంతో ఆమె ఫైనల్‌ ఆడకుండానే నిష్క్రమించింది.

పగ బట్టిన విధి
భారత స్టార్‌ రెజ్లర్‌కు కాలం కలిసి రావడం లేదు. తన శక్తికి మించిన పోరాటం చేస్తున్నా పరిస్థితులు పగ బట్టినట్టు ఆమెకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. టోర్నీల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నా విధి చేస్తున్న వింత నాటకంలో ఆమె బలైపోతున్నది. భారత్‌కు పతకాలు తీసుకురావాలనే ఆమె కల తీరడం లేదు. తాజాగా పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ అదే పరిస్థితి ఎదురైంది. అద్భుతమైన ప్రదర్శనతో ఒలింపిక్స్‌లో ఫైనల్‌ వరకు దూసుకెళ్లినా అనూహ్య రీతిలో అనర్హత వేటు పడడం ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఇప్పుడు కాస్‌లో కూడా ఆమెకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News