Koil Alwar Thirumanjanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో యేడాదిలో నాలుగు సార్లు ఆలయ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దాంతో పాటు గ్రహాణం ఇతరత్రా ఏదైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఆలయాన్ని నీటితో పూర్తి కడిగి శుద్ది చేస్తుంటారు. తిరుమల ఆలయంలో నిర్వహించే ఈ సేవను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం గా పిలుస్తూ ఉంటారు. అసలు తిరుమలలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం గా ఎందుకా పేరు వచ్చింది.. ? ఆగమ శాస్త్రం ప్రకారం ఇది ఎందుకు నిర్వహిస్తారు.
తిరుమలలో ప్రతి యేడాది ఉగాది పర్వదినం, స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఆణివార ఆస్థానం, వైకుంఠం ఏకాదశి వంటి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజునే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ రావడం ఆనవాయితీ వస్తోంది. ఈ నెల 4 నుంచి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం ఆలయశుద్ది కార్యక్రమం నిర్వహించారు.
ఆలయంలోని ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపలున్నా ఉపలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను శుద్ద జలంతో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శుద్ధి కార్యక్రమం తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగిస్తారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తుల్ని స్వామివారి దర్శననానికి అనుమతించారు.
ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే పేరు ఎలా వచ్చిందంటే.. ఆళ్వారులంటే 12గురు ఆళ్వారులు గుర్తుకు వస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, తమిళ సాహిత్యంలో వీరికి విశిష్టమైన స్తానం ఉన్న విష్ణు భక్తులు. తమ పాశురాలతో మహా విష్ణువును కీర్తించి దక్షిణాపథనా భక్తి సంప్రదాయాన్ని వ్యాపింపజేసిన వారు.
దైవ పరిభాషలో దేవాలయాన్నే ఆళ్వార్ గా చెప్పడం వైష్ణవ సాంప్రదాయంలో ఉంది. మరోవైపు ఆలయాన్ని కోయిల్ గా పిలుస్తుంటారు. కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ప్రధాన ఆర్చా మూర్తి ఉన్న ప్రదేశాన్ని సంప్రోక్షణ లేదా అభిషేకించడం అనే అర్దం కూడా ఉంది.
ముఖ్యంగా ఆలయ పరిసరాలను, గర్భాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి జరిపే సేవనే ‘కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ గా పిలుస్తుంటారు. ప్రతి యేడాది నాలుగు సార్లు ఈ సేవ జరుగుతుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ముందే వచ్చే మంగళ వారాల్లో ఈ శుద్ది కార్యక్రమం జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ శుద్ది కార్యక్రమంలో శుద్ద జలంలో సుగంధ ద్రవ్యాలను కలిపి గర్భాలయంతో పాటు చుట్టు ప్రదేశాలను శుద్ది చేయడం కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ ప్రధాన ఉద్దేశ్యం.
సామాన్య శకం..1535 నాటికి యేడాదిలో పది దాకా బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారట. ప్రతి బ్రహ్మోత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ చేసేవారని అప్పటి శాసనాల్లో లిఖించబడి ఉంది. అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన ఆ దేవ దేవుడికి యేటా 450 పైగా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తున్నారు. అందులో అత్యంత పవిత్రమైన స్వామి వారి కైంకర్య సేవనే కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవగా పిలుస్తారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే.. తమిళ పరిభాషలో కోయిల్ అంటే కోవెల (దేవాలయం) అని అర్ధం. ఆళ్వారు అంటే భక్తుడు అని అర్ధం. భక్తుని హృదయ మందిరంలో దేవ దేవుడు కొలువైనట్టే.. కోవెలలో స్వామి వారు కొలువై ఉంటాడనేదానికి సాక్ష్యమే కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం. శ్రీవారి పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయంగా వైఖానస ఆగమోక్తంగా శుద్ది చేసే కైంకర్య సేవయే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
తిరుమల గర్భాలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా కొలువైన ఉంటారు. ఆ పవిత్ర గర్భాలయ స్థానాన్ని ఆనంద నిలయం గా పిలుస్తుంటారు. ఆనంద నిలయం నుంచి ఆలయ మహాద్వారం వరకు పూర్తి ఆలయాన్ని శుద్ది చేసే కార్యక్రమమే ఈ సేవ ముఖ్య ఉద్దేశ్యం.
శ్రీవారి పై దుమ్మూ ధూళి పడకుండా స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళ వర్ణ వస్త్రాన్ని పూర్తిగా కప్పుతారు. దీన్ని ‘మలైగుడారం’గా పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపల ఉంచుతారు.
శ్రీవారి ఆలయంలో కొలువై ఉన్న అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద, పరివార సమేత దేవతా మూర్తులను ఘంటా మండపం లోకి తరలిస్తారు. దీన్ని గరుడాళ్వార్ సన్నిధిగా పిలుస్తారు. వీటికి అభిషేకం చేసేటపుడు చుట్టు తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజన సేవ కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత కొత్త పట్టు వస్త్రాలతో అలంకరిస్తారు.
గర్భాలయంలో పూజాదికాలు నిర్వహించే అర్చకులు.. వారికి తోడుగా ఉండే పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పై కప్పు (స్లాబు)కు అంటకొని ఉన్న దుమ్ముధూళితో పాటు బూజుతోపాటు కర్పూర మసిని తొలిగించి శుద్ధ జలాలో శుద్ది అంటే అభిషేకం చేస్తారు. కుల శేఖరుడ పడి (స్వామి గర్భాలయం ముందే ఉండే గడప)మొదటు మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు, ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.