ఎస్బీఐ ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఎస్బీఐ పేరిట వైరల్ అవుతున్న ఫేక్ మెసేజెస్, ఫేక్ పోస్టుల విషయంలో అప్రమత్తంగా లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ గోవిందా.. గోవిందా అనుకోవాల్సిందే అని హెచ్చరించింది.
దేశంలో అతి పెద్ద నెట్వర్క్, మిలియన్లకొద్ది కస్టమర్లు కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఫేక్ మెసేజెస్, ఫిషింగ్ మెయిల్స్ ( Fake messages, Phishing mails ) పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా తరచుగా కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా సోమవారంనాడు కూడా ట్విటర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.
సోషల్ మీడియాలో ఎస్బీఐ పేరిట సర్క్యూలేట్ అవుతున్న పోస్టులకు స్పందించే క్రమంలో ఆయా హ్యాండిల్స్ ఒరిజినల్ వేనా కాదా అనేది నిర్ధారించుకోవాల్సిందిగా ఎస్బీఐ సూచించింది.
ఈ సూచనతో పాటే 20 సెకన్ల నిడివి కలిగిన వీడియో ట్విటర్లో షేర్ చేసుకునే సందర్భంలో ఎస్బీఐ ఈ సూచనలు చేసింది. గోప్యంగా ఉంచాల్సిన సొంత విషయాలు ఏవీ ఆన్లైన్లో ఎవ్వరితోనూ పంచుకోరాదని ఎస్బీఐ వెల్లడించింది.
తరచుగా పాస్వర్డ్స్ మార్చుకోవడం వల్ల ఆన్లైన్ మోసాలకు, ఫిషింగ్ సైబర్ క్రైమ్స్ ( Online frauds, Cyber crimes ) బారిన పడకుండా, మోసగాళ్ల చేతికి చిక్కకుండా సురక్షితంగా ఉండొచ్చని ఎస్బీఐ స్పష్టంచేసింది.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్, సోషల్ డిస్టన్సింగ్ అమలులోకి వచ్చాకా ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ( Online transactions ) అధికం అయ్యాయి. దీంతో మోసగాళ్లకు మోసాలు పాల్పడేందుకు అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.
అందుకే సైబర్ క్రిమినల్స్ బారినపడి మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank OF India ) తాజాగా ప్రకటనలో పేర్కొంది.
ఆన్లైన్ లావాదేవీలు చేసే సమయంలో పబ్లిక్‌గా ఉపయోగించే కంప్యూటర్ సిస్టమ్స్‌పై అటువంటి లావాదేవీలు జరపరాదు. అలాగే మీరు లాగాన్ అవుతున్న వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ అవునో కాదో కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి.