Padma Bhushan Balakrishna: నందమూరి బాలకృష్ణ.. యువర్న బాలకృష్ణ.. నట సింహా బాలకృష్ణ.. కాస్త నిన్న ప్రకటించిన పద్మ అవార్డుతో పద్మభూషణ్ బాలకృష్ణ అయ్యారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగంలో 14వ యేట అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ అగ్ర హీరోగా సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈయన గురించి కొన్ని విశేషాలు..
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్..మరెన్నో డిజాస్టర్స్ ఉన్నాయి. అయినా విక్టరీకి పొంగిపోకుండా..ఫ్లాప్ కు కృంగిపోకుండా తన పని చేసుకుంటూ వెళుతూనే ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా.. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఎన్టీఆర్, బసవ తారకం దంపతులకు నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10న ఎనిమిదో సంతానంగా జన్మించారు. ఆ దంపతులకు ఆరో కుమారుడు.14వ యేట ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో సిని నటుడుగా ప్రవేశించి ఇప్పటికీ అవిశ్రాంతంగా హీరోగా సత్తా చాటుతూనే ఉన్నారు.
తన తరంలో అన్ని జానర్స్ అయినా.. సాంఘిక, పౌరాణిక, చారిత్రక, జానసద, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ చిత్రాల్లో నటించి మెప్పించారు.
సోలో హీరోగా ఫస్ట్ మూవీ ‘సాహసమే జీవితం’.. మొదటి సక్సెస్ భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాతో అందుకున్నారు. తన కెరీర్ లో ఎక్కువగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నటించారు.
కథానాయకుడిగా విజయశాంతితో ఎక్కువ చిత్రాల్లో నటించారు. అంతేకాదు ఒకేరోజు తన సినిమాకు తానే పోటీగా రెండు చిత్రాలను నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలను రిలీజ్ చేసి ఔరా అనిపించారు. ఈ రెండు చిత్రాలు వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.
మొత్తంగా తాతమ్మ కల నుంచి మహారథి వరకు దాదాపు 10 చిత్రాల్లో తన సొంతపేరైన బాలకృష్ణ పేరుతోనే నటించారు. అంతేకాదు తన తరంలో 18 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరోగా రికార్డు క్రియేట్ చేశారు.
హిందూపురం నుంచి మూడు సార్లు తన తండ్రి స్థాపించిన తెలుగు దేశం పార్టీ తరుపున హాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా తండ్రి ఎన్టీఆర్ తర్వాత పద్మ పురస్కారం అందుకున్న దక్షిణాది ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ గా మారడంతో పాటు వ్యాపార ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ 60 ప్లస్ ఏజ్ లో దూసుకుపోతున్నారు.