Mukesh Ambani Private Jet Price and Features: ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ సరికొత్త విమానం కొనుగోలు చేశారు. మన దేశంలో మొట్టమొదటి మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9 విమానాన్ని ఆయన తీసుకున్నారు. ఈ విమానం ఖరీదు రూ.1000 కోట్లు. ఇదే ప్రస్తుతం అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్. ఈ విమానంతో కలిపి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ దగ్గర మొత్తం 10 విమానాలు ఉన్నాయి. బోయింగ్ 737 MAX 9 విమానం అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని.. మార్పులు చేర్పులతో భారత్‌కు చేరుకుంది.
ముఖేష్ అంబానీ కోసం బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానంలో చాలా మార్పులు చేశారు. స్విట్జర్లాండ్‌లోని యూరో ఎయిర్‌పోర్ట్ బాసెల్-మల్హౌస్-ఫ్రీబర్గ్‌లో క్యాబిన్, ఇంటీరియర్‌లో మార్పులు చేసి భారత్‌కు తీసుకువచ్చారు. మార్పులు, చేర్పులు తరువాత విమానం కండీషన్ చెక్ చేయడానికి చాలాసార్లు పరీక్షించారు. ప్రైవేట్ జెట్ బాసెల్, జెనీవా, లండన్ లూటన్ విమానాశ్రయాల మధ్య ఆరు టెస్ట్ డ్రైవ్‌లను నిర్వహించారు.
ఈ విమానం గత నెల 27న బాసెల్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. 6,234 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల్లోనే చేరుకుంది. ఈ విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కార్గో టెర్మినల్ దగ్గర పార్క్ చేశారు. త్వరలోనే ముంబైకి వెళ్లనుంది.
బోయింగ్ 737 మ్యాక్స్ 9 అత్యంత ఖరీదైనది. ఇందులో రెండు పవర్‌ఫుల్ ఇంజన్లు ఉంటాయి. ఇవి ఎక్కువ దూరం స్పీడ్‌గా ప్రయాణించేందుకు ఉపయోగపడతాయి. ఈ విమానానికి నాన్‌స్టాప్‌గా 11,770 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే కెపాసిటీ ఉంటుంది. ఈ బోయింగ్ 737 మ్యాక్స్ 9 ధర దాదాపు రూ.990 కోట్లు ఉంటుంది. ఈ విమానం కోసం ముఖేష్ అంబానీ రూ.1000 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ జెట్‌లలో బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానమే అత్యంత అధునాతనమైనది. ముఖేష్ అంబానీ వద్ద ఇప్పటకే ఎయిర్‌బస్ A319 ACJ ఉంది. ఈ విమానం గత పదేళ్లుగా సేవలు అందిస్తోంది. రెండు బొంబార్డియర్ గ్లోబల్ 5000 జెట్‌లు, బొంబార్డియర్ గ్లోబల్ 6000, డస్సాల్ట్ ఫాల్కన్ 900, ఎంబ్రేయర్ ERJ-135 విమానాలు కూడా ఉన్నాయి.
పది విమానాలే కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద రెండు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. తక్కువ దూరాలకు ప్రయాణించే సమయంలో ఈ హెలికాఫ్టర్లను ఉపయోగిస్తారు.
కొత్తగా కొనుగోలు చేసిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో ఒకేసారి 19 మంది ప్రయాణం చేయవచ్చు. ఈ విమానం అత్యధికంగా గంటకు 870 కి.మీ వేగంతో ఎగురుతుంది.