Karnataka BJP Ministers Wealth: కర్ణాటక ఎన్నికల ప్రచార హోరు తారాస్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. మరోవైపు అభ్యర్థుల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. అధికార పార్టీ మంత్రుల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడైంది. ఎవరి ఆస్తి ఎంత పెరిగిందంటే..
పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్ నిరాణి చరాస్తులు 2018లో రూ.16 కోట్లు ఉండగా.. 2023లో రూ.27.22 కోట్లకు పెరిగింది. రియల్ ఎస్టేట్ ఆస్తి రూ.4.58 కోట్లు కాగా.. గత ఐదేళ్లలో రూ.8.6 కోట్లకు పెరిగింది. ఆయన భార్య కమల ఆస్తులు 2018లో రూ.11.58 కోట్లు కాగా.. 2023లో రూ.35.35 కోట్లకు చేరింది.
వైద్య విద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కె.సుధాకర్ చరాస్తులు 2018లో రూ.1.11 కోట్లు ఉండగా.. 2023 నాటికి రూ.2.79 కోట్లకు పెరిగింది. ఆయన భార్య డాక్టర్ ప్రీతి జీఏ ఆస్తి 2018లో రూ.1.17 కోట్లు కాగా.. 2023లో రూ.16.1 కోట్లకు చేరింది.
సహకార శాఖ సహాయ మంత్రి ఎస్టీ సోమశేఖర్ చరాస్తులు 8 రెట్లు పెరిగాయి. 2018లో రూ.67.83 లక్షలు ప్రకటించగా.. 2023లో రూ.5.46 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.
ఇంధన శాఖ మంత్రి సునీల్ కుమార్ 2023లో రూ.1.59 కోట్ల విలువైన చరాస్తులను కలిగి ఉన్నట్లు ప్రకటించారు. 2018లో రూ.53.27 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు.
పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి సీసీ పాటిల్ ఆస్తులు 2018లో చరాస్తులు రూ.94.36 లక్షలు ఉండగా.. 2023 నాటికి రూ.3.28 కోట్లకు పెరిగింది. గత ఐదేళ్లలో ఆయన స్థిర ఆస్తులు కూడా పెరిగాయి. రూ.4.47 కోట్ల నుంచి రూ.7.2 కోట్లకు పెరిగింది.