7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త పొందే అవకాశం ఉంది. బడ్జెట్‌లో కొత్త పే కమిషన్ ఏర్పాటు ప్రకటన లేకపోయినా.. ఉద్యోగులకు అలవెన్సుల పెంపుదల గురించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు రూపంలో కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ ఇవ్వనుందని చెబుతున్నారు. డీఏ ఎంత పెరగనుంది..? ఎప్పటి నుంచి అమలులోకి రానుంది..? వివరాలు ఇలా..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది మొదటి డీఏ మార్చిలో నాలుగు శాతం పెరిగింది. దీంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. పెంచిన డీఏను కేంద్రం జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసింది.
ప్రస్తుతం రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఉంటాయని ఆశించినా.. నిరాశే ఎదురైంది.
అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. మరికొద్ది రోజుల్లో డీఏ పెంపుపై నోటిఫికేషన్ రానుందని చెబుతున్నారు. రెండో డీఏ పెంపు కూడా 4 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరోసారి డీఏ 4 శాతం పెరిగితే మొత్తం డీఏ 54 శాతానికి చేరుతుంది. జూలై నెలాఖరులోగా ప్రభుత్వం ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటన లేకపోయినా.. మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కేంద్రం ఏడాదికి రెండుసార్లు డీఏను పెంచుతోంది. ఇవి జనవరి, జూలైలో అమల్లోకి వస్తాయి. AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా DA పెంపు ఉంటుంది.
8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని గత కొంతకాలంగా ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఇందుకు సంబంధించిన ప్రకటన వస్తుందని అనుకున్నారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. ఉద్యోగుల సంఘాలు తమ డిమాండ్‌ను మళ్లీ ప్రభుత్వం ముందు ఉంచే అవకాశం ఉంది.
కొత్త వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగులకు డీఎ, హెచ్‌ఆర్‌ఎ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టీఎ) వంటి వివిధ ప్రయోజనాలు, అలవెన్సులు కూడా భారీగా పెరుగుతాయి. అంతేకాదు బేసిక్ పే కూడా రూ.26 వేలకు పెరిగే అవకాశం ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.