7th Pay Commission DA Hike 2024: వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపునకు సంబంధించి భారీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండో డీఏకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి 3 శాతం డీఏ పెంచే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. 3 శాతం డీఏ ప్రకటన వస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? బేసిక్ ఎలా ఉంటుంది..? వివరాలు ఇలా..!
కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసే AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా 3 శాతం డీఏ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మొదటి డీఏ ప్రకటన మార్చిలో రాగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. రెండో డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో వస్తుందని అంచనాలు ఉన్నాయి. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.
డీఏ 50 శాతం దాటితే.. జీరో నుంచి లెక్కిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేయట్లేదు. ప్రస్తుతం జీరో చేయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.
ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. బేస్ ఇండెక్స్ కంటే వినియోగదారుల ధరల సూచిక 50 శాతం పెరిగినప్పుడల్లా బేసిక్ పేలో డీఏను చేర్చాలని 5వ వేతన సంఘం సిఫార్సు చేసిందని.. ఫిబ్రవరి 2004లో బేసిక్ పేలో 50 శాతం డీఏ చేర్చినట్లు గుర్తు చేశారు. అయితే ఆ తరువాత 6వ వేతన సంఘం బేసిక్ పేతో 50 శాతం దాటినా భత్యాన్ని లింక్ చేయవద్దని సిఫార్సు చేసిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు డీఏ పెరుగుతోంది. మొదటి డీఏ జనవరి, రెండో డీఏ జూలై నెలల్లో అమల్లోకి వస్తుంది.
ప్రతి నెల చివరి పనిదినం రోజు కార్మిక మంత్రిత్వ శాఖ AICPI ఇండెక్స్ డేటాను విడుదల చేస్తుంది. ఈ డేటా ఆధారంగా జూలై 2024 నుంచి డీఏ 3 శాతం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్ 53 శాతానికి చేరుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ లెక్కింపు ఇలా.. డీఏ శాతం= [(గత 12 నెలల సగటు AICPI-115.76)/115.76] x 100; ప్రభుత్వ రంగ ఉద్యోగుల డీఏ గణన- డీఏ శాతం = [(గత 3 నెలలకు సగటు AICPI - 126.33)/126.33] x 100.
ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం రూ.31,500 అనుకుంటే.. ప్రస్తుత 50 శాతం డీఏ లెక్కిస్తే.. మొత్తం నెలకు రూ.15,750 అవుతుంది. ఇది 6 నెలలకు రూ.94,500 అవుతుంది. జూలై 2024 నుంచి డీఏ 3 శాతం పెరిగితే 53 శాతానికి చేరుతుంది. అయితే సబ్సిడీ మొత్తం నెలకు రూ.16,695 అవుతుంది. ఇది 6 నెలలకు రూ.1,00,170 వరకు పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.