కెనడాలో సత్తా చాటిన సిక్కు కుర్రాడు

                  

Last Updated : Oct 2, 2017, 03:04 PM IST
కెనడాలో సత్తా చాటిన సిక్కు కుర్రాడు

టొరంటో : కెనడాలో తొలిసారిగా ఒక ప్రధాన రాజకీయ పార్టీకి  సిక్కు కుర్రాడు నాయకుడిగా ఎన్నికయ్యాడు. కెనడాలో న్యూ డెమక్రటిక్ పార్టీకి నాయకుడిగా ఎన్నికైన జగ్మీత్ సింగ్ ప్రస్తుతం ఒంటారియోలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 38 ఏళ్ల జగ్మీత్ సింగ్ ఈ ఎన్నిక తర్వాత 2019లో జరిగే దేశ ఎన్నికల్లో అధికార పార్టీ నేత మరియు ప్రధాని మంత్రి జస్టిన్ ట్రెడోతో పోటీ పడాల్సి ఉంది. ప్రస్తుతం తన నాయకత్వానికి సంబంధించి జరిగిన పార్టీ ఎన్నికల్లో జగ్మీత్ సింగ్ తన సమీప అభ్యర్థులపై 53.6 శాతం ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తన మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు. కెనడా రాజకీయ చరిత్రలో ఒక మైనారిటీ మరియు ఎన్నారై ఒక ప్రధాన పార్టీ నాయకుడిగా ఎన్నికవ్వడం ఇదే తొలిసారి కావడంతో ఆ దేశంలో భారతీయ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ప్రస్తుతం జగ్మీత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూ డెమక్రటిక్ పార్టీ, కెనడా పార్లమెంటులో 338 సీట్లకు గాను 44 సీట్లతో మూడవ స్థానంలో ఉంది. ఈ పార్టీకి కొత్త అధినేతగా బాధ్యతలు చేపట్టిన జగ్మీత్ సింగ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ఎన్నికల్లో సంస్కరణలు మొదలైన అంశాల పట్ల తమ ప్రధాన వైఖరి ఉంటున్నట్లు పేర్కొన్నారు. 

జగ్మీత్ సింగ్ ఒంటారియోలోని స్కార్‌బర్గ్ ప్రాంతంలో 1979లో  ఒక ప్రవాస పంజాబీ కుటుంబంలో జన్మించారు. పశ్చిమ ఒంటారియో విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రంలో బీఎస్సీ చేసిన జగ్మీత్ ఆ తర్వాత, యార్క్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం గ్రేట్ టొరంటో ప్రాంతంలో క్రిమినల్ డిఫెన్సు లాయరుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కెనడాలో దాదాపు 1.4 శాతం మంది సిక్కుల జనాభా ఉండడం గమనార్హం. ఆ ప్రభుత్వ రక్షణ మంత్రి కూడా సిక్కు మతస్థుడే కావడం గమనార్హం.  

Trending News